'విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని'

29 May, 2014 12:10 IST|Sakshi
'విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని'

హైదరాబాద్ : విజయవాడ-గుంటూరు మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని ఆపార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు.  అందువల్లే  చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గుంటూరు జిల్లాలోనే  ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆయన గురువారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలోని రాజధానులకు ధీటుగా తీర్చిదిద్దుతామని మోదుగుల పేర్కొన్నారు. పోలవరం ముంపు  మండలాలను సీమాంధ్రలో కలపటం ఆర్డినెన్స్ ప్రకారమే అధికారులు నిర్ణయం తీసుకున్నారని మోదుగల అన్నారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని ఆయన తెలిపారు.

కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా జూన్ 8వ తేదీన గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకరం చేయనున్న విషయం తెలిసిందే. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదిక నిర్మించనున్నారు. జూన్ 8వ తేదీ ఉదయం 11.35 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గురువారం తన నివాసంలో గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై ఆయన వారితో చర్చలు జరిపారు.

 

మరిన్ని వార్తలు