ఇంటి నుంచే ‘మార్పు ’ప్రారంభం కావాలి

5 Dec, 2019 13:02 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

సాక్షి, విజయవాడ: ‘దిశ’ హత్యోదంతం నేపథ్యంలో మహిళలు, యువతుల భద్రతకు బెజవాడ పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. గురువారం సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ‘భద్రం బిడ్డ’ పేరుతో అవగాహన కార్యక్రమాలకు సీపీ ద్వారకా తిరుమలరావు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా సంఘటన జరిగినప్పుడల్లా కొత్త చట్టాల డిమాండ్ వినిపిస్తోందని.. ఆ ఆలోచనా ధోరణి సరైంది కాదన్నారు. ఉన్న చట్టాలని సక్రమంగా అమలు చేస్తే చాలని తెలిపారు. నిర్భయ, పోక్సో చట్టాలు చాలా పటిష్టమైనవన్నారు. ‘100’ ఒక్క నంబర్ గుర్తు పెట్టుకొని ఆపద ఉంటే కాల్ చేయాలని.. ఆరు నిమిషాల్లో పోలీసులు మీ ముందు ఉంటారన్నారు.

కొన్ని దేశాల్లో ఇప్పటికీ కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారని.. ఉరి తీయమనేంత ఆక్రోశం కలిగించిన దారుణ ఘటన ‘దిశ’ ఘటన అని పేర్కొన్నారు. ‘ఇంటి నుంచి పిల్లలు బయటకెళ్లే సమయంలో తల్లిదండ్రులు ఆడ పిల్లలకు మాత్రమే జాగ్రత్తలు చెబుతారు. మహిళల పట్ల ఎలా మసులుకోవాలో మగ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలని’ సూచించారు. మార్పు అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ కి రెస్పాండ్ కాకూడదన్నారు. లఘు చిత్రాల ప్రదర్శన ద్వారా పోలీసు యాప్‌లపై కళాశాల విద్యార్థినిలకు ఆయన అవగాహన కల్పించారు. 100,1090,1091,121,181 వంటి యాప్‌ల గురించి సీపీ వివరించారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని కళాశాలల్లో కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పిస్తామని సీపీ తిరుమలరావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు