విషజ్వరాలతో గ్రామాలు విలవిల

11 Sep, 2015 04:35 IST|Sakshi
విషజ్వరాలతో గ్రామాలు విలవిల

మంగళగిరి : విష జ్వరాలు విసృ్తతంగా వ్యాపిస్తున్నాయి. దీంతో రాజధాని గ్రామాలు మంచం పడుతున్నాయి. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలతో పాటు దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాలలో విష జ్వరాలు ప్రబలడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ప్రధానంగా గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున విష జ్వరాలతో బాధ పడుతున్నారు. మంగళగిరి మండలంలో నిడమర్రు, బేతపూడి, కురగల్లు గ్రామాలతో పాటు తాడేపల్లి, ఉండవల్లి, వడ్డేశ్వరం తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, దుగ్గిరాల మండలం మంచికలపూడిలతో పాటు పలు గ్రామాలలో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు భయాందోళన లు వ్యక్తం చేస్తున్నారు.

 కామెర్లతో ముగ్గురు మృతి..
 దుగ్గిరాల మండలం మంచికలపూడిలో వైద్యశిబిరాలు కొనసాగుతుండగా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో గత పది రోజుల వ్యవధిలో జ్వరాలు, కామెర్లతో ముగ్గురు మృతి చెందారు. ఆయా గ్రామాల నుంచి జ్వరాలతో తాడేపల్లి మండలంలో 72 మంది, దుగ్గిరాల మండలంలో 200 మంది, మంగళగిరి మండలంలో 64 మంది, తుళ్లూరు మండలంలో 42 మంది వెరసి మొత్తం 378 మంది జ్వరాలతో బాధ పడుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతుండగా, మరో 300కుపైగా రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ఇదే అదనుగా డెంగీ అని భయపెడుతూ పరీక్షలు, చికిత్సల పేరుతో దోచుకుంటున్నారు. ఆర్‌ఎంపీ వైద్యుడు దగ్గరికి వెళ్లినా పరీక్షలు చేయించుకోవాలని అతనికి తెలిసిన ఆసుపత్రిలో చేరుస్తూ కమీషన్లు వసూల్ చేసుకుంటున్నారు. డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా పేర్లతో ఆయా ఆసుపత్రుల్లో దోపిడీ చేస్తున్నారని పేద రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 పట్టించుకోని పంచాయతీలు..
 పది రోజులుగా గ్రామాల్లోని ప్రజలు జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్నా ఆరోగ్య సిబ్బందిగానీ, పంచాయతీ సిబ్బందిగానీ పట్టించుకున్న దాఖలాల్లేవు. ఆయా కాలనీల్లో డ్రైనేజి కాలువలు సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు, మురుగునీరు ఎక్కడికక్కడే రోడ్లపై నిలిచిపోయాయి. వర్షాల కారణంగా తాగునీరు సైతం కలుషితం అయ్యాయి. ప్రజలు బోర్ల నీటినే తాగుతున్నారు. బావుల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేదు.
 
 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
 గ్రామాల్లోని ఎస్సీ,ఎస్టీ కాలనీలతో పాటు బీసీ కాలనీల్లో  వందలాది మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం కారణంగా దో మలు పెరిగి జ్వరాలు వ్యాపిస్తున్నాయి. తక్షణమే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ప్రత్యే క  వైద్య శిబిరాలు నిర్వహించి  మందులు పంపిణీ చేయాలి. అందుబాటులో ఉన్న పీహెచ్‌సీల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా వైద్యాధికారి, కలెక్టర్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లాం. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాను.
 - ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, మంగళగిరి

>
మరిన్ని వార్తలు