జ్వరం.. వణుకుతున్న జనం!

4 Oct, 2023 03:51 IST|Sakshi

రాష్ట్రంలో ఏ ఇంటి తలుపు తట్టినా జ్వర బాధితులే..

కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5,315 డెంగీ కేసులు

మరణాలు కూడా నమోదవుతున్నాయంటున్న క్షేత్రస్థాయి సిబ్బంది

వైద్యారోగ్యశాఖ అధికారికంగా వెల్లడించడం లేదనే విమర్శలు

ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబాలు

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఒడిశా కాలనీకి చెందిన బోయ అజయ్, బోయ మరియమ్మల కుమార్తె అక్షర (3) విషజ్వరంతో ఆదివారం మృతి చెందింది. చిన్నారికి తీవ్ర జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఏటూరునాగారంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ సరిగా వైద్యం అందక.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసింది.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని పోచమ్మవాడకు చెందిన గోస్కుల శ్రీజ (4) అనే చిన్నారి డెంగీ లక్షణాలతో మరణించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు తొలుత సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలిసింది.

కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం కొత్మీర్‌ గ్రామానికి చెందిన యువకుడు మిట్టె నాగరాజు (24) ఆదివారం రాత్రి విష జ్వరానికి బలయ్యాడు. అప్పటికే నాలుగైదు రోజులుగా జ్వరంతో కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందినా పరిస్థితి మెరుగుకాలేదు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

సాక్షి ప్రతినిధి, వరంగల్‌
రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు విజృంభించి జనం అల్లాడుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 5,315 డెంగీ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య సంగతేమోగానీ పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

ఏ ఇంటి తలుపు తట్టినా ఒక్కరిద్దరు జ్వరంతో మంచాన పట్టి కనిపిస్తున్నారు. గత ఇరవై రోజులుగా విష జ్వరాల తీవ్రత మరింతగా పెరిగింది. డెంగీ, మలేరియాలతో గత ఐదారు రోజుల్లోనే ఉమ్మడి వరంగల్‌లో నలుగురు మృత్యువాత పడటం ఆందోళనకరం. గోదావరి పరీవాహక ఏజెన్సీ ప్రాంతాల్లో.. ముఖ్యంగా కొమురంభీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, జేఎస్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ పల్లెల్లో జ్వరాలు హడలెత్తిస్తున్నాయి.

గంటల వ్యవధిలోనే ప్రాణం పోయింది
చలాకీగా నవ్వుతూ, నవ్విస్తూ కళ్లముందు తిరిగిన నాబిడ్డ గంటల వ్యవధిలోనే దూరమైపోయింది. గత నెల 28న ఆమెకు జ్వరం వస్తే.. స్థానిక ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లాం. పరీక్షించి ఇంజక్షన్‌ ఇచ్చి, సిరప్‌ రాసిచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి సిరప్‌ తాగిస్తే తెల్లవారే సరికి జ్వరం తగ్గింది. రెండు రోజులు బాగానే ఉంది. కానీ 30న మధ్యాహ్నం కడుపులో నొప్పి అంటూ వాంతులు చేసుకుంది. వెంటనే ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాం. రూ.10వేలు అడ్వాన్సుగా తీసుకుని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. కానీ పరిస్థితి సీరియస్‌గా ఉందని, తమ వల్ల కాదంటూ 65 కిలోమీటర్ల దూరంలోని మణుగూరుకు వెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్తుండగానే నా బిడ్డ ప్రాణాలు విడిచింది.    – బోయి అజయ్, (అక్షర తండ్రి) 

ఆందోళన వద్దు.. 
మలేరియా, డెంగీ జ్వరాల పట్ల ఆందోళన వద్దు. అప్రమత్తంగా ఉంటే చాలు. ఇటీవల జ్వరాలు విజృంభిస్తుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారుల సూచన మేరకు డెంగీ, మలేరియాలను నియంత్రించేందుకు గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాం. జ్వరం లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సహాయం పొందాలి. రక్త పరీక్షలు చేయించుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులకు తగినన్ని మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్‌ సాంబశివరావు,డీఎంహెచ్‌ఓ, హనుమకొండ 

మరిన్ని వార్తలు