స్మార్ట్‌ స్ట్రీట్‌

3 Oct, 2018 07:53 IST|Sakshi
స్మార్ట్‌ స్ట్రీట్‌గా మారనున్న నగర రహదారి ఇది..

సిటీ వీధులకు స్మార్ట్‌ హంగు

రూ.164 కోట్ల భారీ ప్రాజెక్ట్‌

నాలుగు అంచెలుగా వర్గీకరణ

నగరంలో ఓ మార్గం. వినోద్‌ రోడ్డు మీద నడుస్తున్నాడు. రోడ్డంటే రోడ్డనుకునేరు.. ఇప్పటి ఫుట్‌పాత్‌కు భిన్నంగా భేషుగ్గా ఉన్న పాదచారుల మార్గంలో అతడు అడుగేస్తున్నాడు. గమ్యానికి వేగంగా చేరాలనిపించింది. బస్టాప్‌లో నిల్చున్నాడు.. అది కూడా మామూలుగా లేదు. వైఫై ఈజీగా అందుబాటులో ఉంది. హంగు చాలానే ఉంది. జీపీఎస్‌ కారణంగా ఆ దారిలో బస్సులు ఏవేవి ఎక్కడున్నాయో కళ్లెదురుగా  స్క్రీన్‌ మీద కనిపిస్తోంది. దాన్ని చూస్తే బస్సులు దరిదాపుల్లో లేవని అర్థమైపోయంది. ఇంకెందుకు ఆలస్యం? అని వినోద్‌ రెండడుగులు వేసి అక్కడే ఉన్న బైక్‌ షేరింగ్‌ ఐలండ్‌కు వెళ్లి వివరాలు తెలిపి స్మార్ట్‌గా ఉన్న సైకిల్‌ తీసుకున్నాడు. సైక్లింగ్‌ ట్రాక్‌లో హుషారుగా సైకిల్‌ తొక్కుతూ గమ్యానికి ముందే చేరుకున్నాడు. సైకిల్‌ అక్కడే వదిలేసి నాలుగడుగుల్లో ఆఫీసుకు ఎంచక్కా వెళ్లాడు. దారంతా పచ్చని మొక్కల మధ్యలో ప్రయాణించి, కనువిందైన హరిత ఐలెండ్‌లు దాటుకుంటూ రావడంతో విసుగన్నదే లేకుండా హుషారుగా పనిలో మునిగిపోయాడు... ఇదంతా ఏ దేశంలోనో అనుకుని నిట్టూరుస్తున్నారా.. ఆగండాగండి.. ఈ హంగులన్నీ వేరే చోట కాదు.. మన వైజాగ్‌లోనే. దాదాపు రెండేళ్ల వ్యవధిలో ఇవన్నీ మన వీధుల్లోనే వాస్తవాలు కాబోతున్నాయి. ఈ స్మార్ట్‌ స్ట్రీట్స్‌ కోసం జీవీఎంసీ ఉత్తుత్తి మాటలు చెప్పడం లేదు. గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

విశాఖసిటీ: మహా నగరం మరింతగా స్మార్ట్‌ హంగుల్ని సంతరించుకోబోతోంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా వీధుల్ని ఆకర్షణీయంగా మార్చేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ సమాయత్తమవుతోంది. నాలుగు ప్రాజెక్టులుగా విభజించి 19.43 కిలోమీటర్ల మేర వీధుల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆకట్టుకునే ఐలాండ్స్, సైక్లింగ్‌ ట్రాక్‌లతో పాటు వైఫై స్పాట్‌లతో కూడిన అనేక మౌలిక సదుపాయాలతో ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

విశాల విశాఖ నగర వీధులు జిగేల్‌మననున్నాయి.  స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.400 కోట్లు మాత్రమే విడుదల చేశాయి. ఈ నిధులకు సంబంధించిన పనులు పూర్తయిన వెంటనే.. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకునేందుకు జీవీఎంసీ చకచకా ప్రణాళికలు సిద్ధం చేసేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 23నæ 9 స్మార్ట్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది.

ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనది స్మార్ట్‌ స్ట్రీట్స్‌ పథకం. మహా నగరంలో వీధులు తళుక్కుమనేలా.. రూపొందించేందుకు డిజైన్‌ చేసిన ఈ ప్రాజెక్టు ఆకట్టుకునేలా ఉంది. దీనికోసం ఆయా శాఖల సమన్వయం అవసరమైనందున ఇప్పటికే వీఎంఆర్‌డీఏ, ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీసీ అధికారులు, ఈపీడీసీఎల్‌ సిబ్బంది, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులతో జీవీఎంసీ పలు దఫాలుగా సమావేశం నిర్వహించింది. రూ.164 కోట్లతో ఏబీడీ ప్రాంతంలో 19.43 కిలోమీటర్ల విస్తీర్ణంలో 20 రహదారుల్ని స్మార్ట్‌ స్ట్రీట్స్‌గా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. షాపూర్‌జీ పల్లాన్‌జీ సంస్థ ఈ పనుల టెండర్‌ను దక్కించుకుంది.

రూపాంతరమిలా..
స్మార్ట్‌ వీధుల్ని రహదారులకు ఇరువైపులా అభివృద్ధి చేస్తారు. సుమారు 6.4 మీటర్ల వెడల్పు వంతున వీటిని తీర్చిదిద్దుతారు.
రోడ్డుకు ఇరువైపులా సైకిల్‌ ట్రాక్‌లు, వాకింగ్‌ ట్రాక్‌లు వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు.
1.5 మీటర్ల సైకిల్‌ ట్రాక్, 2.5 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు.
పాదచారులకు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు కానుంది.
రహదారికి ఇరువైపులా వాకింగ్‌ ట్రాక్‌లలో బఫర్‌ ప్రాంతాల్లో పచ్చదనం పరచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
అక్కడక్కడా వైఫై  స్పాట్లను ఏర్పాటు చేయనున్నారు.
బీచ్‌రోడ్డులో ప్రస్తుతం ఉన్న పబ్లిక్‌ బైక్‌ షేరింగ్‌ ప్రాజెక్టును స్మార్ట్‌ స్ట్రీట్స్‌కు విస్తరించనున్నారు. మొత్తం 80 పబ్లిక్‌ బైక్‌ షేరింగ్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
ఈ ప్రాజెక్టులో మొత్తం 8 జంక్షన్‌లు వస్తాయి. ప్రతి జంక్షన్‌లోనూ స్మార్ట్‌ ఐలాండ్‌ ఏర్పాటు కానుంది.
ఈ ఐలాండ్స్‌లో ల్యాండ్‌ స్కేపింగ్‌ చేసి, మొక్కలు, రంగులు వేసి ఆకర్షణీయంగా మారుస్తారు. మరికొన్ని ఐలాండ్స్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేయనున్నారు.
హరిత రహదారి విస్తరణకు ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేయనున్నారు.
వాణిజ్య ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
బస్టాపులో భద్రత, సౌకర్యం, పూర్తిస్థాయి బస్సు సమాచారం ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
ఈ బస్టాపులు సోలార్‌ వ్యవస్థతో రూపుదిద్దుకోనున్నాయి.
రహదారి మధ్యలో సేదతీరేందుకు వసతి స్థలాలు, విశ్రాంతి తీసుకునే షెడ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

20 రహదారులు.. 19.43 కి.మీ.
నగరంలోని 20 రహదారుల్ని స్మార్ట్‌ వీధులుగా అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 19.43 కిలోమీటర్ల పరిధిలో ఈ వీధులు స్మార్ట్‌ కానున్నాయి. కేజీహెచ్‌ డౌన్‌రోడ్‌లో 1.08 కిలోమీటర్లు, కేజీహెచ్‌ అప్‌లో 0.45 కి.మీ.  జిల్లా పరిషత్‌ జంక్షన్‌ నుంచి నోవాటెల్‌ డౌన్‌ వరకూ 1.96 కి.మీ., కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి నౌరోజీ రోడ్‌ వరకూ 0.93 కి.మీ., నౌరోజీ రోడ్‌లో 1.37 కి.మీ., హార్బర్‌రోడ్‌లో 3.2 కి.మీ., వాల్తేర్‌ మెయిన్‌రోడ్‌లో 4.91 కి.మీ., చినవాల్తేర్‌ రోడ్‌లో 2.07 కి.మీ., నౌరోజీ రోడ్‌ నుంచి ఆలిండియా రేడియో దారిలో 0.98 కి.మీ., దసపల్లా హిల్స్‌ రెసిడెన్షియల్‌ రోడ్‌లో 0.87 కి.మీ. మేర స్మార్ట్‌ స్ట్రీట్స్‌గా అభివృద్ధి చెందనున్నాయి.  

రెండేళ్లలో పూర్తి
స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా విశాఖ నగర వీధుల్ని ఆకర్షణీయమైన వీధులుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నాం. స్మార్ట్‌ స్ట్రీట్స్‌కు సంబంధించిన డిజైన్ల రూపకల్పన ప్రారంభించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. 18 నుంచి 24 నెలల్లో పనులు పూర్తి చేసి స్మార్ట్‌ వీధుల్ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. జీవనశైలి సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతున్న నేపథ్యంలో.. వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ తరహా స్మార్ట్‌ స్ట్రీట్స్‌ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాం.        
– హరినారాయణన్,  జీవీఎంసీ కమిషనర్‌.

మరిన్ని వార్తలు