‘ఓటుకు కోట్లు’ కేసుపై సుప్రీంలో మరోసారి పిటిషన్‌

25 Nov, 2019 15:48 IST|Sakshi

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఎర్లీ హియరింగ్‌ కోసం ఆర్కే ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2017లో పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ.. సుప్రీం కోర్టులో లిస్టింగ్‌ కాకపోవడంతో ఆర్కే సోమవారం మరోసారి సుప్రీంను ఆశ్రయించారు.

కాగా, 2015లో తెలంగాణలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఆ పార్టీ నేతలు అప్పటి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టారు. ఈ క్రమంలో అప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొన్ని రోజులపాటు జైలులో గడిపారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల అనంతరం  రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. 

అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి.  స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు కూడా చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు 2016లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. 

మరిన్ని వార్తలు