వెయిటింగ్ చాలు... కన్‌ఫర్మ్ చేయండి

17 Dec, 2013 14:21 IST|Sakshi
వెయిటింగ్ చాలు... కన్‌ఫర్మ్ చేయండి

కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలి
* ‘వ్యాగన్’ పనులు ప్రారంభించాలి
* కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడే పెట్టాలి
* రైల్వే మంత్రికి మన ఎంపీల ప్రతిపాదనలు
* బడ్జెట్ తయారీలో రైల్వేశాఖ

 
సాక్షి, హన్మకొండ: 2014-15 రైల్వే బడ్జెట్‌కు ఆ శాఖ కసరత్తు ప్రారంభించింది. కొత్త పనుల ప్రతిపాదనలను ఎంపీల నుంచి ఇప్పటికే స్వీకరించింది. రైల్వే శాఖకు సంబంధించి తమ నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపించాలని మన ఎంపీలు ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వేబోర్డుకు పంపించారు. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు వారధిగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు ‘డివిజన్ హోదా’ ఇవ్వడంతో పాటు వ్యాగన్ వర్క్ షాప్ పనులను వెంటనే ప్రారంభించాలని రైల్వేమంత్రికి విన్నవించారు.

కొత్తమార్గాల నిర్మాణం, కొత్తరైళ్లను కేటాయించాలని కోరారు. దీంతో పాటు కాజీపేట స్టేషన్ సామర్థ్యాన్ని కూడా పెంచాలని ప్రతిపాదించారు. ఇంతేకాకుండా రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ బిల్లులో పేర్కొన్న కోచ్‌ఫ్యాక్టరీని కాజీపేటకే కేటాయించేలా ఒత్తిడి తీసుకొస్తామని ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. మన ఎంపీలు ఈ ప్రయత్నాల్లో ఉండగా.. మరోవైపు గుల్బర్గాను డివిజన్‌గా చేయాలంటూ కర్ణాటకకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రయత్నా లు ముమ్మరం చేశారు. దీంతో పోటీ రసవత్తరం గా మారింది. ఈసారి కాజీపేటకు డివిజన్ హో దా, కోచ్‌ఫ్యాక్టరీ, కొత్తరైళ్లు వంటి ప్రధాన డిమాం డ్లలో ఎన్ని ఆమోదం పొందుతాయో వేచి చూడాలి.
 
కాజీపేటలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలి : రాపోలు ఆనంద భాస్కర్, ఎంపీ
స్టేషన్‌ఘన్‌పూర్-పాలకుర్తి-సూర్యాపేట-నల్లగొండ వరకు కొత్తరైల్వే లైన్ నిర్మించాలి. కాజీపేట కేంద్రంగా ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న కాజీపేట జంక్షన్‌ను 1905లో నిర్మించారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా అభివృద్ధి చేయాలి. గత బడ్జెట్‌లో మంజూరైన వ్యాగన్ వర్కుషాప్ పనులు సత్వరమే ప్రారంభించాలి. రైల్వే పరంగా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర సాంకేతిక విభాగాలలో ఉన్న ఉద్యోగుల శిక్షణా కేంద్రం విజయవాడలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందున కాజీపేటలో మరొక శిక్షణా కేంద్రం అవసరం ఉంది.  
 
కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలి: సిరిసిల్ల రాజయ్య, ఎంపీ
గతంలో కాజీపేటకు మంజూరైన రైల్‌కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్‌కు తరలిపోయింది. కాబట్టి తిరిగి కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కో రతాను. అంతేకాకుండా కాజీపేట కేంద్రంగా కొ త్త రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలి. గతంలో సర్వే చేపట్టిన హసన్‌పర్తి-కరీంనగర్, మణుగూరు-రామగుండంల మధ్య కొత్త రైల్వే మార్గాలు నిర్మించాలి. కాజీపేట స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు ఏర్పాటు చేయాలి. రైల్వే ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో కొత్తగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పా టు చేయాలి. అదే విధంగా వరంగల్, కాజీపేటలో మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్‌లను నిర్మించాలి.
 
కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలి : గుండు సుధారాణి, ఎంపీ
ఉత్తర, దక్షిణ భారతానికి వారధిగా ఉన్న కాజీపేట కేంద్రంగా ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సికింద్రాబాద్ తర్వాత రెండో పెద్ద స్టేషన్ అయిన కాజీపేటలో డివిజన్ ను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేయవచ్చు. అంతేకాకుండా కాజీపేట కేంద్రంగా దేశంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా రైళ్లను ప్రారంభించాలి. అందుకు అనుగుణంగా ఇక్కడ పిట్‌లైన్లు, ఫ్లాట్‌ఫారమ్‌ల సంఖ్య పెంచా లి. వీటితో పాటు వ్యాగన్ వర్కుషాప్‌కు సంబంధించి భూ కేటాయింపునకు నిధులు మంజూరయ్యాయి కాబట్టి పనులు వేగవంతం చేయాలి. కాజీపేటలోని రైల్వే ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి.

మరిన్ని వార్తలు