మామూళ్లిస్తేనే..

22 Jun, 2014 04:51 IST|Sakshi
మామూళ్లిస్తేనే..

- రైతులకు తప్పని ట్రాన్స్‌ఫార్మర్ కష్టాలు
- డబ్బు ఇవ్వనిదే స్పందించని సిబ్బంది
- నూతన ట్రాన్స్‌ఫార్మర్లకోసం ఎదురు చూపులు
- పెండింగ్‌లో 2 వేల దరఖాస్తులు  

నెల్లూరు(హరనాథపురం): విద్యుత్ సరఫరాలో కీలకమైన ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైతే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 11,316 సింగిల్ ఫేస్, 23,928 త్రీఫేస్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. కాలిపోయినప్పుడు వెం టనే మార్చేందుకు రోలింగ్ పేరుతో నాలుగు శాతం ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంగా ఉంచాల్సి ఉండగా ప్రస్తుతం అవి 2.3 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ విలు వ రూ.75 వేలు నుంచి రూ.లక్ష వర కు ఉంటుంది.

 ప్రతి నెలా జిల్లాలో సుమారు 500 ట్రాన్స్‌ఫార్మర్లు కాలి పోతుంటాయి. ఒక్క నెల్లూరు డివిజ న్‌లోని వీటి సంఖ్య నెలకు 180 వర కు ఉంటుంది. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేసేందుకు ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరులో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు సెంటర్లు ప్రైవేటు రంగంలో నడుస్తున్నాయి.

రైతు అవసరాలే ఆదాయ వనరు
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే సంబంధిత ఏఈ దృష్టికి తీసుకెళ్లి రికార్డుల్లో నమోదు
 చేసుకోవాలి. రైతు ఫిర్యాదు చేసిన 48 గంటల్లో అధికారులే ప్రభుత్వ వాహనంలో మరో ట్రాన్స్‌ఫార్మర్ తీసుకొచ్చి అమర్చాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల వరకు ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొంది. రైతులు చందాల వేసుకుని ఏఈ, లైన్‌మన్, హెల్పర్ల చేయితడిపితే కాని స్పందన ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిన సమయంలో రైతుల అవసరాన్ని బట్టి రూ.3 వేలు నుంచి రూ.12 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కావలి, గూడూరు డివిజన్లలో రూ.10 వేలు వరకు, నెల్లూరు, ఆత్మకూరు డివిజన్లలో రూ.15వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లను తరలించేందుకు 19 సబ్‌డివిజన్ల పరిధిలో మూడు వాహనాలు మాత్రమే ఉండడంతో రవాణా చార్జీలు సైతం రైతులపైనే పడుతున్నాయి.
 
మరమ్మతు కేంద్రాల్లోనూ దందా
అక్రమ వసూళ్ల దందా ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కేంద్రాల్లోనూ సాగుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముడుపులిచ్చిన వారికి వెంటనే కొత్తవి ఇస్తున్నారని, లేని పక్షంలో రోజుల తరబడి తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులోనూ తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ప్రస్తుతం జిల్లాలో 2 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ కు సంబంధించి లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో త్రీఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు