కొఠియాలో వారపు సంత ప్రారంభం

22 Mar, 2018 13:00 IST|Sakshi
కొఠియాలో వారపు సంత  ప్రారంభిస్తున్న ఒడిశా అధికారులు, నాయకులు

సాలూరు రూరల్‌ : వివాదాస్పద ఆంధ్ర–ఒడిశా సరిహద్దు కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ప్రజలను తమ వైపునకు తిప్పుకునే అన్ని ప్రయత్నాలు ఒడిశా ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా కొఠియా గ్రామంలో ఒడిశా ఆధ్వర్యంలో వారపు సంతను బుధవారం ప్రారంభిచారు. ఈ సందర్భంగా ప్రజలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు, నాయకులు మాట్లాడుతూ కొఠియా గ్రూప్‌ గ్రామాలు ఒడిశా రాష్ట్రానికి చెందినవేనని స్పష్టం చేశారు. ప్రతి బుధవారం ఇక్కడ వారపు సంత జరుగుతుందని ప్రభుత్వ నిధులతో సంతను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు విత్తనాలు మార్కెట్‌ ధరకే అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలోనే ప్రతి బుధవారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఏ విషయంలోనూ ఆంధ్రాపై ఆధారపడవద్దని సూచించారు. ఈ గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో ర్యాలి నిర్వహించారు. ఇంతవరకూ కొఠియా గ్రూప్‌ గ్రామాల ప్రజలు ప్రతి మంగళవారం ఆంధ్రా రాష్ట్రంలోని సారిక పంచాయతీ నేరెళ్లవలసలో జరిగే వారపు సంతకు వచ్చేవారు. ప్రస్తుతం కొఠియాలోనే ఒడిశా ప్రభుత్వం వారపు సంతను ఏర్పాటు చేయడంతో వారికి సంత అందుబాటులోకి వచ్చినట్టయింది. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ కృషి బాస్‌రౌత్, ఎమ్మెల్యే ప్రఫుల్‌ కుమార్‌ పంగి, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, పొట్టంగి మాజీ ఎంపీ జయరాం పంగి, పొట్టంగి బ్లాక్‌ ఛైర్మన్‌ జగజ్జిత్‌ పంగి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు