తరలుతున్న తెల్ల బంగారం

14 Oct, 2019 12:11 IST|Sakshi
కుప్పగాపోసిన తెల్లరాయి

సాక్షి, ప్రకాశం : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉంటే కొండను సైతం పిండిచేయగలరు కొందరు.  పీసీపల్లి మండలంలోని లక్ష్మక్కపల్లి, లింగన్నపాలెం, అడవిలోపల్లి, వెంగళాయపల్లిలోని అడవుల్లో, కొండలను  జేసీబీతో చదును చేసి తెల్లరాయిని వేరుచేసి అక్రమంగా తరలిస్తున్నారు.  ఒక కొండను కాని, ఒక క్వారీని తవ్వాలంటే మైనింగ్‌ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి.  కానీ పీసీపల్లి మండలంలో అధికారుల అండ ఉంటే చాలు ఇవేవీ అవసరం లేదు. మండల పరిధిలోని లక్ష్మక్కపల్లి, వెంగళాయపల్లి, గుంటుపల్లిలో తదితర గ్రామాల్లో నిల్వ ఉన్న తెల్లరాయిని అక్రమంగా తవ్వి చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు తరలిస్తున్నారు. తెల్లరాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉండడంతో దీని లారీ రేటు రూ.2 లక్షలు పలుకుతోంది. మైనింగ్‌ అనుమతి తీసుకోకుండానే వారు కొండలను తవ్వుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్‌ అధికారులు పట్టీపట్టనట్లుగా ఉన్నారు. రెవెన్యూ అధికారులు అయితే మైనింగ్‌ అధికారులే పట్టించుకోలేదు మాకెందుకుంటూ మామూళ్లతో  మిన్నకుండిపోతున్నారు. దీంతో తవ్వకాలు సాగించిన చోట లోయలుగా ఏర్పడి జనవాసాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
 
300 ఎకరాల్లో యథేచ్ఛగా అక్రమ క్వారీయింగ్‌: 
మండలంలో దాదాపు 300 ఎకరాల్లో తెల్లరాయి క్వారీయింగ్‌ జరుగుతుందంటే అక్రమార్కుల హవా ఏమేర ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రాంతాన్ని క్వారీయింగ్‌ చేయాలంటే ఆ రెవెన్యూ, ఫారెస్ట్, మైనింగ్‌ శాఖల అనుమతి తప్పనిసరి. అయితే మండల పరిధిలో ప్రభుత్వ భూమి, బంజరు భూముల్లో క్వారీయింగ్‌ అనుమతి లేకుండా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. చుండి, మాలకొండ, లక్ష్మక్కపల్లి అడవుల్లో యథేచ్ఛగా చెట్లను నరికి వేసి ప్రాంతాన్ని జేసీబీతో చదును చేసి క్వారీయింగ్‌ సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ కానీ, రెవెన్యూ, మైనింగ్‌ శాఖ కానీ తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలోని మెట్లవారిపాలెం, గుంటుపల్లి, వెంగళాయపల్లి గ్రామాల్లో వ్యవసాయం చేసినంత సులువుగా తెల్లరాయి క్వారీయింగ్‌ చేస్తున్నారు.  దీనిపై సదరు శాఖల అధికారులను వివరణ అడుగగా వారు వివరాలు వెల్లడించడానికి ఇష్టపడడం లేదు.  

మరిన్ని వార్తలు