ప్రతిపక్ష నేత ఎవరు?

26 May, 2019 03:19 IST|Sakshi

ఆ పాత్ర పోషించేందుకు ఇష్టపడని చంద్రబాబు 

మరో నేతకు అప్పగిస్తారని పార్టీలో ప్రచారం   

సాక్షి, అమరావతి :  ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుంగిపోయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్న విషయం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. తీవ్ర అవమానభారంతో ప్రజలకు మొహం చూపించేందుకు సైతం వెనుకాడుతున్న ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడడంలేదని పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఫలితాల తర్వాత రెండు రోజుల నుంచి తనను కలుస్తున్న నాయకులతో ఆయన మాట్లాడుతున్న తీరు ఈ ప్రచారానికి దారితీసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 151 ఉండడం, తన వయసు రీత్యా అసెంబ్లీలో వారిని ఎదుర్కోవడం వంటి కారణాలను చూపి ప్రతిపక్ష నేత బాధ్యతలకు దూరంగా ఉంటే ఎలా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండి, గెలిచిన సీనియర్‌ ఎమ్మెల్యేల్లో ఒకరికి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయని నాయకులు చర్చించుకుంటున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కింజరాపు అచ్చెన్నాయుడు, కరణం బలరామకృష్ణమూర్తి తదితరుల్లో ఒకరిని ప్రతిపక్ష నేతగా పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన తమ అధినేత మదిలో ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేతగా తానుండాలా, ఎవరికైనా బాధ్యత అప్పగించాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలోనే ఇంతవరకూ పార్టీ శాసనసభాపక్ష సమావేశంపై నోరు మెదపడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

దారుణ ఓటమితోనే వైరాగ్యం
చంద్రబాబు వ్యవహార శైలి, ఆలోచనా తీరు తెలిసిన నేతలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోరని, ఆయనే ప్రతిపక్ష నేతగా ఉంటారని చెబుతున్నారు. ఓటమి భారంతో ప్రస్తుతం వైరాగ్యంగా మాట్లాడుతున్నా కొద్దిరోజుల్లో తేరుకుని మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలమవుతారని చర్చించుకుంటున్నారు. ఓటమిని ఆయన ముందే ఊహించినా అది ఇంతటి దారుణంగా ఉంటుందని అనుకోలేదని, రాష్ట్ర రాజకీయ చరిత్రనే తిరగరాసే రీతిలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

గెలుపు ఓటములు సహజమే అయినా వైఎస్సార్‌ పార్టీకి 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు రావడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని, జగన్‌మోహన్‌రెడ్డికి ఈ స్థాయి ప్రజాదరణ ఎలా వచ్చింది, దాన్ని ఎందుకు గుర్తించలేకపోయానని బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బయటకు వచ్చేందుకు సైతం ఇష్టపడని ఆయన కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే ప్రతిపక్ష నేత ఎన్నికపై నిర్ణయం ఉంటుందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. పార్టీ భవిష్యత్తుపైనా, అంతకు మించి తన కుమారుడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న చంద్రబాబు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా లోకేష్‌ని పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మండలిలో యనమల రామకృష్ణుడు టీడీపీ పక్ష నేతగా ఉండగా ఆయన స్థానంలో లోకేష్‌ను పెడితే ఎలా ఉంటుందనే దానిపై చర్చిస్తున్నారు. 

మరిన్ని వార్తలు