పంటలెందుకు వేసుకోనివ్వడం లేదు?

21 Feb, 2015 03:14 IST|Sakshi

    రాజధాని ప్రాంతంపై
    ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
 విచారణ 23కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం భూములు సమీకరించాలని తలపెట్టిన ప్రాంతాల్లో రైతులను ఎందుకు పంటలు వేసుకోనివ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని అదనపు అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రపదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) చట్టం కింద చేస్తున్న భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) నుంచి తమ భూములను మినహాయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు భీమిరెడ్డి శివరామిరెడ్డి, మరో 31 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ముందుగా సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపి స్తూ పిటిషనర్లు పేద రైతులని, వారికున్న కొద్దిపాటి పొలమే వారికి జీవనాధారమని, ప్రభుత్వం ఇప్పుడు వారికి జీవనాధారం లేకుండా చేయాల్సి చూస్తోందని చెప్పారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం వీరి భూములను వీరి ఇష్టానికి వ్యతిరేకంగా, బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని నివేదించారు. భూ సమీకరణను పిటిషనర్లతో పాటు చాలా మంది రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారని, వారిని ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. భూ సమీకరణను వ్యతిరేకించిన ఆరు గ్రామాల్లోని రైతులకు చెందిన పంటలను, పంపులను, షెడ్లను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారని చెప్పారు. భూ సమీకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, వాటిని అధికారులకు సమర్పించామని, ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమని ఆయన వివరించారు. ఈ సమయంలో దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ అభ్యంతరాలపై ఉత్తర్వులు జారీ చేయకముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని చెప్పారు. అభ్యంతరాల సమర్పణకు గడువు తేదీ పొడిగించామని, ఆ తేదీ తరువాత మరో 15 రోజులకు ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉందని తెలిపారు. దీనికి న్యాయమూర్తి పిటిషనర్లను ఉద్దేశించి.. ‘మీ హక్కులకు ఈ దశలో ఎటువంటి భంగం కలగడం లేదు కదా? మరి అలాంటప్పుడు మీకున్న భయాందోళనలు ఏమిటి?’ అంటూ వ్యా ఖ్యానించారు. భూ సమీకరణ పేరుతో అధికారులు రైతులను పంటలు వేసుకోనివ్వడం లేదని సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి.. అలా ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని అదనపు ఏజీని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
 

మరిన్ని వార్తలు