మరణమూ విడదీయలేదు

11 May, 2017 11:18 IST|Sakshi

శ్రీకాకుళం: అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరం తోడుగా ఉంటామని బాసలు చేసుకున్నారు. జీవన మలి సంధ్య వరకు చేసిన బాసలను నిలబెట్టుకుంటూ ఒకరి కోసం ఒకరు బతికారు. ఆఖరుకు మరణంలోనూ విడిపోకుండా ఒకరి వెంట మరొకరు నడిచారు. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేట మండలం ధనుకువాడ గ్రామానికి చెందిన మెండ సావిత్రి(65) బుధవారం వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఆమె మృతితో భర్త శ్రీరాములు(70) విలవిలలాడిపోయారు.

తల్లి మరణించిన విషయాన్ని కందుకూరులో ఉంటున్న వారి కుమారుడు విశ్వనాథంకు స్థానికులు తెలియజేశారు. గురువారం ఉదయానికి గ్రామానికి చేరుకుంటానని, అప్పటి వరకు మృతదేహాన్ని ఉంచాలని ఆయన కోరడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే, భార్య మృతి చెందినప్పటి నుంచి ఆమె పార్థివ దేహం పక్కనే ఉన్న భర్త శ్రీరాములు చాలా సేపటి నుంచి కదలకుండా ఉండడం స్థానికులు గమనించారు.

ఏమైందని పరిశీలించి చూస్తే ఆయన కూడా తుది శ్వాస విడిచారని వారికి అర్థమైంది. ఈ భార్యాభర్తలు మరణించడంతో ధనుకువాడ గ్రామంలో విషాదం అలముకుంది. వీరికి ఒక కొడుకు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని వార్తలు