మద్యంపై మహిళాగ్రహం

30 Jun, 2015 02:28 IST|Sakshi
మద్యంపై మహిళాగ్రహం

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌చేస్తూ మహిళా సంఘాల రాష్ట్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సబ్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యానులో ఎక్కించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కొంతమందిని అరెస్ట్‌చేసి సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
- సబ్-కలెక్టరేట్ ముట్టడికి మహిళల యత్నం
- పోలీసులు - మహిళల మధ్య తోపులాట, ఉద్రిక్తత
విజయవాడ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ సోమవారం మహిళలు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. మహిళా సంఘాల రాష్ట్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు కొద్దిసేపు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేశారు. మద్యం అమ్మకాలపై నిప్పులు చెరుగుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వారిని అడ్డుకుని.. అరెస్ట్ చేసి సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఐద్వా), ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల జీవితాలను పణంగా పెడుతోందన్నారు.

దశలవారీగా బెల్టుషాపులు రద్దు చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోసం చేశారని చెప్పారు.  సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స దుర్గాభవానీ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం కోసం పండ్ల మాదిరిగా మద్యాన్ని టెట్రా ప్యాకెట్లలో విక్రయించేందుకు సిద్ధమవుతోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యం టెండర్లను నిలుపుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  ఈ ఆందోళనలో పాల్గొన్న మహిళా సంఘాల నాయకులు కె.శ్రీదేవి, పంచదార్ల దుర్గాంబ, కాజా సరోజ, ఓర్సు భారతి, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగాభవానీతో పాటు పెద్దసంఖ్యలో మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు