వీరప్పన్‌ స్వయంగా చెప్పిన సంఘటనలతో డాక్యుమెంటరీ సిరీస్‌.. అక్కడే స్ట్రీమింగ్‌

14 Dec, 2023 12:12 IST|Sakshi

కూసీ మునిసామి వీరప్పన్‌ అంటే చాలా మందికి తెలియదు. అదే గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ అంటే తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈయన అసలు పేరు కూసీ మునిసామి వీరప్పన్‌. ఈయన గురించి ఇప్పటికే పలు చిత్రాలు, సీరియల్స్‌ రూపొందాయి. తాజాగా ఆయన నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'కూసీ మునిసామి వీరప్పన్‌' అనే డాక్యుమెంటరీ సిరీస్‌ తెరకెక్కింది. దీన్ని నక్కీరన్‌ గోపాల్‌(ఈయన టీమ్‌.. వీరప్పన్‌ను అప్పట్లో ఇంటర్వ్యూ చేశారు) కూతురు ప్రభావతి.. ధీరన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించారు. శరత్‌ జ్యోతీ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ నేటి(డిసెంబర్‌ 14) నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


నక్కిరన్‌ గోపాలన్‌తో ఆయన కూతురు ప్రభావతి

చాలామంది నా దగ్గరకు వచ్చారు
ఈ సందర్భంగా యూనిట్‌ వర్గాలు చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నక్కీరన్‌ గాపాలన్‌ మాట్లాడుతూ.. నక్కీరన్‌ అంటే ధైర్యం కావాలనీ, ఆ తరువాత వీరప్పన్‌ అంటే ఇంకా ధైర్యం కావాలని అన్నారు. కూసీ మునిసామి వీరప్పన్‌ డాక్యుమెంటరీ సిరీస్‌తో ఈ రెండింటినీ సాధ్యం చేశారని పేర్కొన్నారు. వీరప్పన్‌ కథతో చిత్రాన్ని చేయడానికి చాలా మంది తన వద్దకు వచ్చారని, తన కూతురు అడగడానికి ముందు దివంగత దర్శకుడు బాలు మహేంద్ర కూడా తనను అడిగారనీ చెప్పారు. అయితే దాన్ని సరిగా చేయాలన్న ఉద్దేశంతో తాను వీరప్పన్‌ను ఇంటర్వ్యూ చేసిన వీడియోను ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు.

వీరప్పన్‌కు నేనంటే ఇష్టం
ఈ వీడియో కోసం తన టీమ్‌ చాలా కోల్పోయినట్లు పేర్కొన్నారు. వీరప్పన్‌ గురించి ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాలు, సీరియల్స్‌ అన్నీ పోలీసుల కథనాలతో రూపొందాయన్నారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ మాత్రమే వీరప్పన్‌ స్వయంగా చెప్పిన సంఘటనలతో రూపొందించబడిందన్నారు. దీన్ని తన కూతురు టీమ్‌ చాలా బాగా రూపొందించిందని చెప్పారు. తనకు వీరప్పన్‌ అంటే ఇష్టం అనీ, ఆయనకు తానంటే ఇష్టం అనీ, అలాగని తాను ఈ సిరీస్‌తో వీరప్పన్‌కు అనుకూలంగా రిపోర్ట్‌ చేయలేదనీ చెప్పారు. తాము బాధింపుకు గురైన ప్రజల తరపునే నిలిచామని చెప్పారు.

చదవండి: ఆ సీన్‌ లేకుంటే ‘యానిమల్‌’ ఇంత పెద్ద హిట్‌ అయ్యేది కాదు: బాబీ డియోల్‌

>
మరిన్ని వార్తలు