‘ముగ్గురు నలుగురు వద్దు, ఒక్కరిద్దరే ముద్దు’

11 Jul, 2020 13:10 IST|Sakshi

జిల్లాలో జనమే జనం 

మానవ వనరుల వృద్ధికి ఊతం

మౌలిక వసతులకు పెనుభారం

పెరుగుతున్న పథకాల అవసరం

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

ఒంగోలు మెట్రో: పెరుగుతున్న జనాభా మానవ వనరుల వృద్ధికి ఊతంగా ఉపకరిస్తుందనేది ఎంత సత్యమో ఆకలి బాధలు కూడా పెరుగుతాయనేది అంతే సత్యం. ఏటికేటికీ పెరుగుతున్న జనాభా వల్ల నిరుద్యోగ సమస్య, ఆకలి మరణాలు, ఆరోగ్య ఇబ్బందులు, పేదరికంతోపాటు నివాస సమస్య, నిరక్షరాస్యత లాంటి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏ కుటుంబమైనా, దేశమైనా అభివృద్ధి చెందడం అనేది జనాభా మీదే ఆధారపడి ఉంటుంది. జనాభా నియంత్రణపై అవగాహన పెరిగినప్పటికీ, ఇది పూర్తిస్థాయిలో కనిపించకపోవడం వల్ల జనాభా పెంపుదల మీద అదుపు లేకుండా పోతోంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరుగుదల..లాభనష్టాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

ప్రకాశం @పనామా
ప్రపంచ జనాభాలో 40 శాతం ఆసియా దేశాలైన ఇండియా, చైనాలోనే ఉన్నారు. జూలై 11, 1987న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరగా.. ఇప్పుడా సంఖ్య 540 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభా ఏటా 9.20 కోట్లు పెరుగుతోంది. దేశంలో 1881 నుంచి జనగణన ప్రారంభించగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో 2011లో జనగణన చేపట్టారు. ప్రస్తుత ఇండియాలో జనాభా 140 కోట్లకు చేరువలో ఉండగా ప్రకాశం జిల్లాలో 40 లక్షల మార్కుకు దగ్గరవుతోంది. మధ్య అమెరికాలోని పనామా దేశంతో సమానమైన సంఖ్యలో జిల్లాలో జనాభా ఉన్నారు. అంతేకాదు అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్ర జనాభాతో మన జిల్లా జనాభా సమానం. ఇక మే 2010 జనాభా లెక్కల ప్రకారం పనామా జనాభా 34,05,813. సరిగ్గా పదేళ్ల క్రితం ప్రకాశం జిల్లా జనాభా కూడా ఇంతే ఉంది.  

జిల్లాలో పరిస్థితి ఇదీ..  
2011లో 34 లక్షలున్న జిల్లా జనాభా ఇప్పుడు 40 లక్షలు దాటే అవకాశం ఉంది. జిల్లాలో అక్షరాస్యత 63.53 శాతంగా ఉంది. జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 981 మంది స్త్రీలు  ఉన్నారు. తద్వారా లింగ వివక్ష ఉన్నట్టు రుజువవుతోంది. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో అక్షరాస్యత తక్కువ. జనసాంద్రత చదరపు కిలోమీటర్‌కు 193గా ఉంది. జనాభా పెరుగుతుండటం వల్ల జీవనావసరాలు పెరిగి ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతోంది. ఏదో ఒక ఉద్యోగం సాధించడానికి నిరుద్యోగులు ఇతర ప్రాంతాల్లోని కోచింగ్‌ సెంటర్లకు క్యూకడుతున్నారు. ఇక ప్రజలు తాగడానికి పూర్తి స్థాయిలో నీటి సదుపాయాలు ఉండటం లేదు. పేద కుటుంబాల్లోనే జనాభా సంఖ్య పెరిగిపోతోందని అధికారిక గణాంకాలు, వివిధ సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. జనాభా నియంత్రణ ప్రాధాన్యం, గర్భ నిరోధక సాధనాలపై అవగాహనా లేమి దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

జనాభా తక్కువగా ఉంటే..
జనాభా తక్కువగా ఉంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. మంచి ఆహారం అందరికీ దొరుకుతుంది. మంచి నివాసాలు నిర్మించుకోగలరు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం, ఉపాధి దొరుకుతుంది. పేదరికం తగ్గిపోయి ఆకలి మరణాలు లేని కాలం ఎదురొస్తుంది. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించగలుగుతారు.

నష్టాలు అధికమే..
జనాభా పెరగడం వల్ల నివాస వసతికే పెద్ద చిక్కులు వస్తాయి. ఇరుకైన ఇళ్లు, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఒకేచోట ఉండాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. దీంతో అంటురోగాలు, అనారోగ్యాలు పెరుగుతాయి. ఇంకోవైపు నిత్యావసరాలు పెరుగుతాయి. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ కారణంగా ఒకపూట తిండి మాత్రమే తినాల్సి వస్తుంది. ఫలితంగా ఆకలి చావులు సంభవిస్తాయి. ఇక పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం కోసం వస్తు సామగ్రి విస్తృత ఉత్పత్తి కోసం పరిశ్రమలు ఏర్పడాలి. వాటి ద్వారా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. నిరుద్యోగ సమస్య, జీవితంలో నిరాశ, సోమరితనం, నిర్లిప్తత పెరిగి క్రమంగా సంఘ విద్రోహ శక్తులు పెచ్చరిల్లే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలంతా జనాభా పెరుగుదలను అరికట్టేందుకు తాత్కాలిక పద్ధతులను, శాశ్వత పద్ధతులను ఎంచుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతులు ఆచరించాలి.  

జనాభా గణాంకాలు కీలకం
ఒక దేశ ఆర్థిక ప్రణాళికలు, సామాజిక పథకాలు రూపొందించడానికి విధిగా జనాభా లెక్కలు అవసరమవుతాయి. ఇటువంటి లెక్కలను ప్రతి దేశమూ సిద్ధం చేసుకుంటుంది. జనాభా లెక్కల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల గుర్తింపు లాంటివి జరిగి వాటిపై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తారు. అందువల్ల జనాభా లెక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.  

నిరోధించడం ఎలా?
జననాల రేటు ఎక్కువగా ఉండి, మరణాల రేటు తక్కువగా ఉండటమే జనాభా పెరుగుదలకు సూచిక. జనాభా పెరుగుదలను కట్టడి చేయాలంటే దంపతులు కుటుంబ నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఆడ అయినా, మగ అయినా సంతానాన్ని ఒకరికి మాత్రమే పరిమితం చేసుకుంటే మంచిది. ఇందుకుగాను ప్రభుత్వం ఉచితంగా కుటుంబ నియంత్రణ లాంటి సేవా సౌకర్యాలు ప్రవేశపెడుతోంది. శాశ్వత పద్ధతులుగా ట్యూబెక్టమీ, డీపీఎల్, ఎస్‌ఎస్‌వీ(వేసెక్టమీ) లాంటివి ఉన్నాయి. తాత్కాలిక పద్ధతులుగా నిరో«ధ్, మాత్రలు, ఐడీయూ లాంటివి ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా ఎవరికి వారు జనాభా నియంత్రణ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.

పరిష్కార మార్గాలు
రోజురోజుకీ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ప్రకృతి వనరులు ఉండటం లేదు. కనుక అవసరాలకు తగినట్టు సహజ వనరులను పొదుపుగా వాడుకోవాలి. ప్రకృతి వనరుల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కలిగించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి.  
మహిళలు, బాలికల సంక్షేమం, చదువుపై శ్రద్ధ చూపాలి.  
గర్భ నిరోధక సాధనాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలి.  
పురుషులను సంతాన నిరోధక ఆపరేషన్లకు ప్రోత్సహించాలి.  
వెద్య రంగ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన మీద అవగాహన పెంచాలి.  
‘ముగ్గురు నలుగురు వద్దు, ఒక్కరిద్దరే ముద్దు’ లాంటి సూచనలు పాటించాలి.  
ఉపాధ్యాయులు, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రామాల్లోని ప్రజలతో జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాలను వివరిస్తూ అవగాహన పెంచాలి.  
జనాభా నియంత్రణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా