నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం

17 Aug, 2014 02:21 IST|Sakshi
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం

 మండాకురిటి(సంతకవిటి) : మరుగుదొడ్ల కోసం నిర్మించిన సెప్టిక్ ట్యాంకులో పడి యశ్వంత్(5) అనే బాలుడు మృతి చెం దారు. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరగ్గా సాయంత్రం మృతదేహం లభిం చింది. విజయనగర జిల్లా గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన కెల్ల సన్యాసిరావు భార్య భారతి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మం డాకురిటి. ఇద్దరు కుమారులతో సహా భార్యాభర్తలి ద్దరూ రెండురోజుల క్రితం మండాకురిటి వచ్చారు. శని వారం సాయంత్రం వీరు తిరిగి కోడూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం వీరి పెద్ద కుమారుడు యశ్వంత్ ఆటాడుకుంటూ ఇంటి సమీపంలోనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాల వైపు వెళ్లాడు.
 
 కొడుకు ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. ఆ క్రమంలో పీహెచ్‌సీ భవనాల సమీపంలో మరుగుదొడ్డ కోసం నిర్మించిన ట్యాంకుల వద్ద బురదలో బాలుడి అడుగుజాడలు కనిపించాయి. దాంతో అనుమానంతో నీళ్లతో నిండి ఉన్న ట్యాంకులోకి దిగి వెతికారు. యశ్వంత్ మృతదేహాన్ని కనుగొని బయటకు తీసుకొచ్చారు. విగతజీవుడైన కుమారుడిని చూడగానే తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఐదేళ్లకే కొడుకు నూరేళ్ల జీవితం ముగిసిపోయిందని గుండెలవిసేలా వలపించారు. మరోవైపు తనను చూడ్డానికొచ్చిన కూతురు, అల్లుడికి పుత్రవియోగం కలగడాన్ని యశ్వంత్ తాత రామారావు తట్టుకోలేకపోయారు. విలపిస్తూ సొమ్మసిల్లిపోయాడు. అయితే ఈ సంఘటనపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని స్థానిక ఎస్సై పి.సురేష్‌బాబు చెప్పారు.
 
 నిర్లక్ష్యమే కారణం
 ఇంతటి దారుణానికి అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని బాధితులతోపాటు చుట్టుపక్కల ప్రజలు ఆరోపించారు. మరుగుదొడ్డి ట్యాంకు నిర్మించి మూత వేయకుండా వదిలేయడం వల్లే నిండు ప్రాణం పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రామారావు ఇంటి సమీపంలో రెండేళ్ల క్రితం పీహెచ్‌సీ భవనాల నిర్మాణం ప్రారంభించారు. రూ.67 లక్షలతో నిర్మిస్తున్న ఈ భవనాలకు మరుడుదొడ్డి వసతి కోసం 15 అడుగుల లోతులో రెండు ట్యాంకులు నిర్మించారు. అయితే వాటికి పైకప్పులు వేయకుండా వదిలేశారు.  ఇటు కాంట్రాక్టర్, అటు అధికారులు ఈ విషయం పట్టించుకోలేదు. వర్షాలకు ఆ ట్యాంకులు నీటితో నిండిపోయాయి. ఇప్పుడు ఈ దుర్ఘటనకు కారణమయ్యాయి. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా ఆ విషయమూ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.

 

>
మరిన్ని వార్తలు