ఏఎన్‌ఎం ఆత్మహత్యాయత్నం

8 Oct, 2017 12:39 IST|Sakshi

కాశీబుగ్గ: శిక్షణకు వచ్చిన ఓ ఏఎన్‌ఎం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హార్పిక్, ఫినాయిల్‌ తాగి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న యువతిని చూసి స్థానికులు పోలీసుల సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. సోంపేట గ్రామానికి చెందిన లావేటి మోహినమ్మ పలాసలో ఓ వసతిగృహంలో ఏఎన్‌ఎంలకు జరిగిన ట్యాబ్‌లపై శిక్షణ కార్యక్రమానికి వచ్చినట్టు భావిస్తున్నారు. అయితే పలాస తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఖాళీస్థలంలో మోహినమ్మ కిందపడి కాళ్లు చేతులు కొట్టుకుని విలవిలలాడుతుంటే కొంతమంది స్థానికులు గమనించారు.

విషయం కాశీబుగ్గ పోలీసులకు ఫోన్‌లో తెలియజేశారు. కానిస్టేబుల్‌ కోటేశ్వరరావుతో పాటు సిబ్బంది వచ్చి ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె నురగలు కక్కుతుంది. దీంతో ఈమె పక్కన ఉన్న బ్యాగును పోలీసులు పరిశీలించగా అందులో దుస్తులు, హార్పిక్, ఫినాయిల్‌ బాటిల్‌ దొరికాయి. బ్యాగులో ఉన్న ఆధారాల బట్టి చూస్తే లావేటి మోహినమ్మగా పోలీసులు గుర్తించారు. అయితే ఈమె ఒంటరిగా హార్పిక్‌ తాగిందా, లేదా ఎవరైనా తాగించారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా కొన్నిగంటలు గడిస్తే తప్ప పరిస్థితి చెప్పలేమని వైద్యులు హేమసుందర్‌ తెలిపారు. అమ్మాయితో ఉన్న బ్యాగ్, బట్టలను కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు