‘మా పెద్దనాన్నది సహజ మరణం కాదు’

15 Mar, 2019 12:16 IST|Sakshi

సాక్షి, పులివెందుల: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి తెలిపారు. పులివెందుల ఆస్పత్రి వద్ద అవినాశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా కుటుంబ పెద్ద దిక్కు, పెద్దనాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆయనది సహజ మరణం కాదు. పెద్దనాన్న మరణం పట్ల మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన తలపై రెండు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయి. చేతి, మొహంపై కూడా గాయాలు కనబడుతున్నాయి. మాకున్న అనుమానాలను నివృత్తి చేయాల’ని కోరారు. (వైఎస్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఫిర్యాదు)

ఎవరో దాడి చేస్తేనే వైఎస్‌ వివేకానందరెడ్డి మరణించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి తెలిపారు.ఆయన మృతిపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కుట్రలో ఎంతటి వారున్న కఠినంగా శిక్షించాలన్నారు. నిన్నంతా మైదుకూరులో ప్రచారం నిర్వహించిన వైఎస్‌ వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని గుర్తుచేశారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తెల్లవారే సరికి చనిపోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయన మృతిపై వాస్తవాలు బయటకు రావాలని అన్నారు.(వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నుమూత)

కాగా, వైఎస్‌ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున పులివెందులలోని ఆయన నివాసంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తొలుత గుండెపోటుతో మరణించినట్టు భావించినప్పటికీ.. ఆయన తలపై, మొహంపై గాయాలు ఉండటంతో ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన సమయంలో వివేకానంద రెడ్డి ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్‌ మార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న కుటుంబసభ్యులు పులివెందులకు బయలుదేరారు. చాల సౌమ్యునిగా పేరున్న వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది

మరిన్ని వార్తలు