కన్నీరు తుడిచి..

15 Jul, 2015 04:35 IST|Sakshi
కన్నీరు తుడిచి..

మృతుల కుటుంబాలకు జగన్ ఓదార్పు
 తొక్కిసలాట బాధితులకు పరామర్శ
 అండగా ఉంటాం..
 అన్నివిధాలా ఆదుకుంటాం
 
 సాక్షి, రాజమండ్రి :గోదావరి పుష్కరాల ప్రారంభం రోజైన మంగళవారం నాడే.. సర్కార్ నిర్వాకం ఫలితంగా పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఓదార్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. షెడ్యూల్ ప్రకారం జగన్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు బుధవారం రావాల్సి ఉంది. అయితే మంగళవారం పుష్కర ఘాట్‌లో ఘోరకలి చోటు చేసుకోవడంతో తీవ్రంగా చలించిపోయిన ఆయన ఒక రోజు ముందుగానే మంగళవారం ఆగమేఘాల మీద రాజమండ్రి తరలివచ్చారు.
 
  హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు విమానంలో బయల్దేరిన జగన్ మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడనుంచి నేరుగా రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి చేరుకుని, మార్చురీవద్ద ఆరుబయట మూటగట్టి ఉన్న యాత్రికుల మృతదేహాలను చూసి చలించిపోయారు. అనంతరం మృతుల కుటుంబాలను ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పరామర్శించారు. జరిగిన దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే ఏమాత్రం ఆలశ్యం చేయకుండా గంటల్లోనే రాజమండ్రి చేరుకున్న జగన్‌ను చూసి ‘మాకోసం వచ్చావన్నా..
 
 మా ఆప్తులను ఈ సర్కార్ పొట్టన పెట్టుకుంది. పుష్కర స్నానానికి వచ్చిన మాకు సౌకర్యాలు కల్పించాల్సిన సర్కార్ మావాళ్ల పాలిట మృత్యురాత రాసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతారహితంగా ప్రవర్తించడంవల్లనే ఈ దుర్ఘటన జరిగింది’ అంటూ బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ‘మాకు డబ్బులొద్దు. కోల్పోయిన మా ఆప్తులను మాకు తెచ్చిపెట్టండి’ అంటూ గద్గద స్వరంతో వారు గగ్గోలు పెడుతుంటే జగన్ వారిని ఓదారుస్తూ చలించిపోయారు. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడన్నా అంటూ జగన్‌ను పట్టుకుని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ‘సర్కార్ వైఫల్యానికి మేము మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మా వాళ్లను వ్యానుల్లో పంపిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం అంబులెన్స్‌ల్లో కూడా పంపేందుకు మావాళ్లు తగరా!’ అని వాపోయారు. దీనిపై స్పందించిన జగన్ మాట్లాడుతూ మానవత్వం లేని మనిషి ముఖ్యమంత్రిగా ఉండడంవల్లనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ ఘటన ముమ్మాటికీ ముఖ్యమంత్రి నిర్వాకంవల్లే జరిగిందన్నారు.
 
 దీనికి ఆయన్నే బాధ్యుడిని చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని అభయమిచ్చారు. ప్రభుత్వాస్పత్రితో పాటు జీఎస్‌ఎల్, బొల్లినేని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సుమారు 70 మందికి పైగా క్షతగాత్రులను జగన్ పరామర్శించారు. పేరుపేరునా పలుకరించి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి నివాసానికి చేరుకుని రాత్రి బస చేశారు.
 
 ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వురుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, జోగి రమేష్, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ఆకుల  వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, సత్తి సూర్యనారాయణరెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ర్ట కార్యదర్శులు జక్కంపూడి రాజా, కర్రి పాపారాయుడు, కొల్లి నిర్మల కుమారి, రావిపాటి రామచంద్రరావు, తాడి విజయభాస్కర రెడ్డి, మిండగుదిటి మోహన్, రాష్ర్ట యువజన ప్రధాన కార్యదర్శులు గిరజాల బాబు, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాస్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ర్ట యువజన కార్యదర్శి గుర్రం గౌతమ్, రాజమండ్రి నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు ఆర్‌వీవీ సత్యనారాయణ చౌదరి, ఆదిరెడ్డి వాసు, వట్టికూటి రాజశేఖర్ పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు