నాడు–నేడుకు ప్రకాశంలో శ్రీకారం

9 Nov, 2019 09:50 IST|Sakshi
సీఎం సభ కోసం ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర హైస్కూల్‌ గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్, జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తదితరులు

 ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారు

ఈనెల 14న ఒంగోలు రాక

సీఎం హోదాలో తొలిసారి ప్రకాశం జిల్లాకు..

‘నాడు–నేడు’ ప్రారంభించనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బంధీ ఏర్పాట్లు

ఒంగోలు, కొత్తపట్నంమండలాల్లో పలు పాఠశాలలు పరిశీలించిన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, ఓఎస్‌డీ, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు

సభా వేదిక కోసం ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల ఎంపిక

ఒంగోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు పర్యటన ఖరారైంది. సీఎం హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రానున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈనెల 14న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు నుంచి ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీలు పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. నాడు–నేడు కార్యక్రమ ఓఎస్‌డీ మురళి, జిల్లా కలెక్టర్‌పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం శుక్రవారం ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో పలు పాఠశాలలను పరిశీలించారు. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలోని కస్తూర్భా విద్యాలయం, వజ్జిరెడ్డిపాలెం, గమండ్లపాలెం మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలను పరిశీలించారు.  ఆ రెండు ప్రాంతాలు ఇసుక నేల కావడంతో ఒంగోలులోని పీవీఆర్‌ హైస్కూలును పరిశీలించారు. నాడు–నేడు కార్యక్రమం ప్రారంభోత్సవం పీవీఆర్‌లోనే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

మన బడి కావాలి అందరికీ ఆదర్శం..
అనంతరం విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని దశల వారీగా చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్, తరగతి గదులు, బ్లాక్‌ బోర్డులు, ప్రహరీల వంటి మౌలిక వసతులు కల్పించేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొదటి విడతగా రాష్ట్రంలో 15 వేల పాఠశాలలను ఎంపిక చేసి ప్రణాళికాబద్దంగా మరమ్మతులు చేపడ్డటం జరుగుతుందన్నారు. రానున్న మూడేళ్లలో మిగిలిన పాఠశాలలను పూర్తి చేయనున్నట్టు చెప్పారు. వీటితో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా పాఠ్య పుస్తకాల్లో సంస్కరణలు తెస్తున్నట్లు తెలిపారు. 2020–21 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు, 2021–22 విద్యా సంవత్సరంలో 5 నుంచి 8వ తరగతి వరకు, 2022–23 లో 9, 10 తరగతుల పాఠ్య పుస్తకాల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాభోదన ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం జనవరిలో 90 వేల మందికి ఇంగ్లిష్‌ బోధనపై ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో 1250 పాఠశాలల ఎంపిక..
జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సారి జిల్లాకు వస్తున్నారన్నారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను పకడ్భందీగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నాడు–నేడు కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఎంపిక చేసిన పీవీఆర్‌ బాలుర పాఠశాలను సీఎం పరిశీలిస్తారన్నారు. జిల్లాలో నాడు–నేడు కింద 1250 పాఠశాలలు ఎంపిక చేసినట్లు తెలిపారు. దీనిలో  జాయింట్‌ కలెక్టర్‌ షన్‌మోహన్, నరేంద్ర ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, సర్వశిక్షా అభియాన్‌ ఈఈ ఏడుకొండలు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ రవి, ఏపీడబ్ల్యూడీసీ డీఈ భాస్కరబాబు, ఓఎంసీ కమిషనర్‌ నిరంజన్‌ రెడ్డి, మున్సిపల్‌ ఇంజనీర్‌ సుందరరామిరెడ్డి, వైయస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు