సీమ సిగలో మరో ఉద్యాన కళాశాల

9 Nov, 2023 05:00 IST|Sakshi

పులివెందులలో నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభం

ఏపీ కార్ల్‌ భవనాల్లో తాత్కాలిక ఏర్పాటు.. నేటి నుంచి తరగతులు

60 సీట్లతో బీఎస్సీ హానర్స్‌ (హార్టి) కోర్సుతో శ్రీకారం

ఇప్పటికే 46 సీట్ల భర్తీ.. మిగిలిన సీట్లు నెలాఖరులోగా భర్తీ

100 ఎకరాల్లో రూ.110 కోట్లతో కళాశాల నిర్మాణానికి త్వరలో టెండర్లు

అడ్మినిస్ట్రేషన్, తరగతి గదులు, లేబొరేటరీలు, హాస్టల్స్, స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణం

ఏపీపీఎస్సీ ద్వారా 30 మంది టీచింగ్, 60 మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ భర్తీకి చర్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో ఉద్యాన కళాశాల అందుబాటులోకి వస్తోంది. రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన విద్యకు ఊతమిచ్చేందుకు వీలుగా పులివెందులలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఉద్యాన కళాశా­లను గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారం­భించనున్నారు.

వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ పరిధిలో నాలుగు ప్రభుత్వ కళాశాలలు (వెంకట్రా­మన్నగూడెం, అనంతరాజుపేట, పార్వతీ­పురం, చిన్నా­లతరపి).. మరో నాలుగు అనుబంధ కళా­శాలలు (అనంతపురం, తాడిపత్రి, వీఎస్‌ పురం, మార్కాపురం) ఉన్నాయి. దాదాపు అన్ని కళాశా­లలు బీఎస్సీ హానర్స్‌ (హార్టి) కోర్సును అందిస్తు­న్నాయి. ప్రభుత్వ కళాశాలల పరిధిలో 520, ప్రైవేటు కళాశాలల పరిధిలో 200 సీట్లు ఉన్నాయి. అలాగే, నాలుగు ప్రభుత్వ, ఏడు ప్రైవేటు పాలిటె­క్నిక్‌ కళాశాలలు కూడా యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్నాయి.

రాయలసీమలో రెండో ఉద్యాన కళాశాలలు..
ఇక వైఎస్సార్‌ జిల్లా అనంతరాజుపేటలో ఇప్పటికే ఉద్యాన కళాశాల ఉంది. తాజాగా.. పులివెందులలో కొత్తగా మరో కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసి­ంది. ఉద్యాన పంటల హబ్‌గా పులివెందుల ఇప్పటికే గుర్తింపు పొందిన నేపథ్యంలో ఈ ప్రాంత­ంలో ఉద్యాన విద్యకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కొత్తగా కళాశాల ఏర్పాటుచేసింది. బీఎస్సీ ఆనర్స్‌ (హార్టి) కోర్సులో 60 సీట్లతో ఈ కళాశాల ఏర్పాట­వు­తోంది.

ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ ద్వారా 46 సీట్లను భర్తీచేశారు. మిగిలిన సీట్లను చివరి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేయనున్నారు. పులివెందులలోని ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఏపీ కార్ల్‌) భవన సము­దాయంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన కళాశా­లను గురువారం సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. 

100 ఎకరాల్లో రూ.110కోట్లతో భవనాలు..
మరోవైపు.. ఈ కళాశాల కోసం 100 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఆ మేరకు భూ కేటాయింపునకు ప్రభుత్వం ఏర్పాట్లు­చేస్తోంది. భవన సముదాయాల కోసం ఇప్పటికే రూ.110 కోట్లు మం­జూరు చేసింది. ఈ నిధులతో పరిపా­లనా భవనం, తరగతి గదులు, అత్యాధునిక లేబొరేటరీలు, విద్యార్థుల కోసం హాస్టల్‌ భవనాలు, సిబ్బంది కోసం క్వార్టర్స్, వెహికల్‌ పార్కింగ్‌ షెడ్లు నిర్మించను­న్నారు. ఇందుకు సంబంధించి త్వరలో టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఈ కళాశాల కోసం రాష్ట్ర ప్రభు­త్వం 30 టీచింగ్, 60 నాన్‌ టీచింగ్‌ పోస్టులను మంజూరు చేసింది.

టీచింగ్‌ పోస్టుల్లో ప్రధానంగా 21 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 6 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 3 ప్రొఫె­సర్‌ పోస్టులు­న్నాయి. వీటిని ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో భర్తీ చేసేందుకు ప్రభు­త్వం ఏర్పాట్లు­చేస్తోంది. ఈ పోస్టు­లు భర్తీచేసే వరకు విద్యా­బోధనకు ఇబ్బందిలే­కు­ండా అనంతరాజుపేట, వెంకట్రామ­న్న­గూడెంలలోని ఉద్యాన కళాశాలల నుంచి ఐదు­గురు అధ్యాపకులను పులివెందుల ఉద్యాన కళాశాలకు బదిలీ చేశారు. వీరంతా ఇప్పటికే విధుల్లో చేరారు. ఇక పులివెందులలో ఉద్యాన కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశామని వర్సిటీ వీసీ డాక్టర్‌ తోలేటి జానకీరామ్‌ ‘సాక్షి’కి తెలిపారు. కౌన్సెలింగ్‌ ద్వారా బీఎస్సీ ఆనర్స్‌ (హార్టీ)లో చేరిన విద్యా­ర్థులకు గురువారం నుంచి తరగ­తులు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు