వినతుల వెల్లువ

17 May, 2015 02:36 IST|Sakshi
వినతుల వెల్లువ

రైతుభరోసా యాత్రలో అడుగడుగునా బడుగుల గోడు    
అండగా నిలబడి ఉద్యమిస్తామన్న వైఎస్ జగన్
ప్రభుత్వం ఒంటెత్తు పోకడలను పదేపదే ఎండగట్టిన ప్రతిపక్ష నేత
రాయదుర్గం సెగ్మెంటులో భరోసా యాత్రకు విశేష స్పందన
కణేకల్లులో ఆత్మహత్య చేసుకున్న రైతు శర్మాస్ కుటుంబానికి పరామర్శ

 
 (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో శనివారం నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ప్రజా సమస్యలు వెల్లువెత్తాయి. అభిమాన నేతను కలిసేందుకు గంటలకొద్దీ రోడ్లపై నిలబడిన వివిధ గ్రామాల ప్రజలు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ వద్ద ఏకరువు పెట్టారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు వాపోయారు. ఈ తరుణంలో సమస్యల పరిష్కారానికి చేయూతనందించాలని విన్నవించారు. గ్రామగ్రామాన వృద్ధులు, మహిళల సాదకబాదకాలను సావదానంగా విన్న వైఎస్ జగన్.. ఉద్యమపంథాలో వాటిని పరిష్కరించుకుందామని చెప్పారు. ఆయన అడుగడుగునా ఆగి బడుగుల వినతిపత్రాలు స్వీకరించారు. వృద్ధులను ఆత్మీయంగా పలకరించారు.

 యాత్ర సాగిందిలా...
 ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లోని నిమ్మకల్లు, సొల్లాపురం, హనుమాన్‌పురం, మాల్యం, కణేకల్లు, గోనెహాల్‌క్రాస్, యర్రగుంట, శ్రీధరఘట్ట గ్రామాల మీదుగా  వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర  సాగింది. ప్రతిగ్రామంలోనూ పెద్దఎత్తున రైతులు ఎదురొచ్చి బాణాసంచా కాల్చి స్వాగతించారు. ఉదయం 10.30 గంటలకు నిమ్మకల్లు చేరిన జగన్‌కు అక్కడి మహిళలు హారతులు పట్టారు. ఆర్టీసీ కార్మికులు బస్సులు నిలిపేసి వైఎస్ జగన్‌ను కలిసి కతజ్ఞతలు తెలిపారు. సొల్లాపురం రైతులు, డ్వాక్రా మహిళలు పూలదండలతో స్వాగతించారు.

మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు బాషా, హుసేనమ్మ.. జగన్‌ను కలిసి ఎనిమిది నెలలుగా వేతనాలు, బిల్లులు అందడం లేదని వినతిపత్రం అందజేశారు. మాల్యం గ్రామం చేరుకున్న జగన్ అక్కడ రోడ్డు పక్కనున్న లాలూనాయక్ కొడుకు జగన్‌మోహన్‌రెడ్డిని ముద్దాడి ఆటోగ్రాఫ్ అందించారు. కణేకల్లు వంతెన సమీపంలో ఎండలో నిలబడ్డ మహిళా కూలీలతో జగన్ కొద్దిసేపు ముచ్చటించారు. పనుల కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి వచ్చామని, ఇక్కడా పనుల్లేవని మహిళలు కేశమ్మ, మల్లమ్మ వివరించారు.

‘పనుల కోసం కరువు జిల్లాకొస్తిరా తల్లీ’ అంటూ వారి నుంచి సెలవు తీసుకున్నారు. కణేకల్లులో ధాన్యం రాశిని ఆరుబయట ఎండబెట్టిన మహిళా రైతు రత్నమ్మను పలకరించారు. వరి ధాన్యానికి ఉన్న ధర, పెట్టుబడి, దిగుబడిపై ప్రశ్నించారు. ఎరువుల ధరలు బాగా పెరిగాయని, వడ్ల(ధాన్యం) ధర మాత్రం రూ.400 తగ్గిందని రైతులు వివరించారు. కణేకల్లు మండల విద్యా వలంటీర్లు కలిసి 2014 అక్టోబరు నుంచి 2015 ఏప్రిల్ వరకూ ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదని వివరించారు.

 శర్మాస్ కుటుంబానికి పరామర్శ
 కణేకల్లులో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు గంగవరం శర్మాస్ ఇంటికెళ్లిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని శర్మాస్ భార్యాపిల్లలకు భరోసా కల్పించారు. అనంతరం గనిగెర గ్రామానికి చేరుకున్నారు. ఎంపీటీసీ సభ్యుడు పాటిక నాగిరెడ్డి ఇంటికెళ్లి  కుటుంబ సభ్యులను పలకరించారు. సీఎం హోదాలో మరోసారి రావాలని నాగిరెడ్డి భార్య రామాంజిమ్మ కోరింది.

అక్కడి నుంచి ఉద్దేహాల్ వైపు యాత్ర కొనసాగింది. గోనేహాల్ క్రాస్, శ్రీధరఘట్ట, ఉద్దేహాల్ గ్రామాల్లో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. వందలాది మంది రైతులు మోటార్‌బైక్‌లపై జగన్ కాన్వాయ్‌ను అనుసరించారు. ఉద్దేహాల్‌లో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహించిన ప్రతిపక్షనేత.. ప్రభుత్వ పోకడలపై పెద్దఎత్తున ధ్వజమెత్తారు. ఆరో రోజు యాత్రలో వైఎస్ జగన్ వెంట అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీ, పార్టీ నేతలు పామిడి వీరాంజనేయులు, సీహెచ్ దిలీప్‌రెడ్డి, వరికూటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
 
 నేటి జగన్ రైతు భరోసా యాత్ర షెడ్యూల్ ఇలా...
 అనంతపురం ఎడ్యుకేషన్  : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతుభరోసా యాత్ర ఆదివారం ఏడో రోజుకు చేరుకుంటుంది. రాయదుర్గం నియోజకవర్గంలో  పర్యటిస్తారు. ఉదయం.. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ నుంచి బయలుదేరి దేవగిరి గ్రామానికి చేరుకుంటారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు గోగినేని నరసింహారావు  కుటుంబాన్ని పరామర్శిస్తారు.

అక్కడి నుంచి డీ. హీరేహాళ్ మండలం పులకుర్తికి చేరుకుంటారు. అక్కడ అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు బోయ రాముడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మండల కేంద్రమైన డీ.హీరేహాళ్ చేరుకుని.. కౌలురైతు తలారి ఈరన్న కుటుంబాన్ని పరామర్శిస్తారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ,  ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

మరిన్ని వార్తలు