ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

13 May, 2015 02:42 IST|Sakshi
ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

అనంతపురం రూరల్ : ‘ఆర్టీసీ కార్మికులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది.. వారు చేపడుతున్న ఉద్యమం ఆగదని.. 43 శాతం ఫిట్‌మెంట్ కోరడం సమంజసమే’నని వైఎస్సార్ సీపీ అధినేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు మంగళవారం  సంఘీభావం తెలిపారు. కార్మికులు సమ్మె చేపట్టి ఏడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఈ ఏడాది ఏప్రిల్ 6న ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారన్నారు. ఆర్టీసీ కార్మికులతో ఓట్లు వేయించుకుని, పనైపోయిందని ఇప్పుడు గాలికి వదిలేశారని విమర్శించారు. తొలుత ఆర్టీసీ జేఏసీ నేతలు సి.ఎన్.రెడ్డి, వి.ఎన్.రెడ్డి, భాస్కర్‌నాయుడు, కొండయ్య, అవధాని శ్రీపాద, వెంకటేష్ తదితరులు వై.ఎస్.జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సి.ఎన్.రెడ్డి, ఈయూ నేత సి.రవీంద్ర, కార్మికులు రాధాకృష్ణ, రామాంజనేయులు తదితరులు జగన్‌మోహన్‌రెడ్డి సేవలు కొనియాడారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణ రెడ్డి, ముఖ్య నేతలు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మీసాల రంగన్న, ఎల్.ఎం.మోహన్‌రెడ్డి, పెన్నోబులేసు, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, జేఎం బాషా, రెడ్డెప్పరెడ్డి, రిలాక్స్ నాగరాజు, రంగంపేట గోపాల్‌రెడ్డి, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు