మేమొస్తేనే అధికారుల్లో చలనం

11 Jan, 2016 09:24 IST|Sakshi
 ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ విమర్శ
 రెండు కుటుంబాలకు పరామర్శ
(రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి) : ‘ఇది దగాకోరు ప్రభుత్వం.. రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రతిపక్ష పార్టీ పరామర్శించేందుకు వస్తుందని తెలియగానే అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మేమొస్తే తప్ప అధికారులు కదిలే పరిస్థితి కనిపించడం లేదు’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతన్నల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించకుండా ప్రభుత్వం లేనిపోని సాకులు చూపుతూ కాలం వెళ్లదీస్తోందన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఐదో రోజు ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని ఉప్పరపల్లి, ఎర్రగుంట గ్రామాల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు పొన్నా మారుతీ ప్రసాద్, నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఉదయం పొన్నా మారుతీ ప్రసాద్ ఇంటికి చేరుకున్న జగన్.. మారుతీ ప్రసాద్ భార్య అక్కమ్మ, తల్లి నారాయణమ్మ, సోదరుడు తిరుపతయ్యలను ఓదార్చారు. ‘అధికారులెవరైనా వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారా? ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇచ్చిందా’ అని జగన్ ప్రశ్నించగా ‘ఏడాదిన్నర అవుతోంది. ఎవరూ రాలేదు. రూపాయి కూడా సాయం చేయలేద’ని భార్య అక్కమ్మ చెప్పారు. తల్లి నారాయణమ్మ మాట్లాడుతూ.. ‘నా భర్త చనిపోయి మూడేళ్లు,  కొడుకు చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. ఇద్దరికీ ఇంత వరకూ వితంతు పింఛన్లు రాలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా అధికారులు పట్టించుకోలేదు. నా పెద్దకొడుకు వికలాంగుడు. వాడికి కూడా పింఛను ఇవ్వడం లేదు. నాకు కేన్సరొస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నా. సంవత్సరం బాగానే ఉంది. మళ్లీ రక్తం పడుతోంది. ఆసుపత్రికి వెళ్తే డబ్బులు కట్టమన్నారు. రూ. 30 వేలు ఖర్చు చేశా. ఇక పెట్టే శక్తి లేక వైద్యం చేయించుకోవడానికి వెళ్లలేదు’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా వైద్యం చేయమంటున్నారు అని ఆమె తెలిపింది. ఇందుకు జగన్ స్పందిస్తూ.. ‘అన్యాయం కదా! మీకు మేం ఆపరేషన్ చేయిస్తామ’ంటూ భరోసా ఇచ్చారు. ముగ్గురు పింఛన్ల విషయంపై లోకాయుక్తలో కేసు దాఖలు చేస్తామన్నారు.
 
అనంతరం ఉప్పరపల్లి నుంచి ఎర్రగుంటకు చేరుకున్న వైఎస్ జగన్.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.  భార్య నాగేంద్రమ్మ, కుమారులు సుదర్శన్‌రెడ్డి, చిన్న ఓబిరెడ్డిలను ఓదార్చారు. మీ నాన్న చనిపోయాక ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిందా అని ఆరా తీయగా.. ‘ఈ రోజే  వీఆర్‌ఏ వచ్చి ఒక పేపర్ ఇచ్చి వెళ్లార’ని చెప్పాడు. జగన్ ఆ లెటర్‌ను తీసుకుని చదివారు. ‘ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభుత్వానికి లేదు. కాబట్టే నారాయణరెడ్డి చనిపోయి ఆరు నెలలవుతోన్నా.. పోస్టుమార్టం రిపోర్టు పెండింగ్‌లో ఉందని సాకులు చెబుతోంద’ని జగన్ మండిపడ్డారు. నారాయణరెడ్డి చిన్న కుమారుడు చిన్న ఓబిరెడ్డి మాట్లాడుతూ.. తాను విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నానని, ఫీజులు కట్టలేదని ఇంటికి పంపారని, మీరే ఆదుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన జగన్.. పక్కనే ఉన్న రాప్తాడు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి సూచిస్తూ అతని చదువు బాధ్యతలు తీసుకోవాలన్నారు. సుదర్శన్‌రెడ్డికి కూడా ఉపాధి కల్పించాలని ప్రకాశ్‌రెడ్డికి సూచించారు.
 
 రైతు : పొన్నా మారుతీప్రసాద్
 ఊరు : ఉప్పరపల్లి, అనంతపురం రూరల్ మండలం
 ఆత్మహత్య చేసుకున్నది: 26-7-2014
 భార్య, 18 నెలల కుమార్తె ఉన్నారు.
 
అప్పుల వివరాలు: అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అక్కమ్మ డ్వాక్రా మహిళా సంఘంలో సభ్యురాలిగా రూ. 20 వేలు రుణం తీసుకుంది. మాఫీ కాలేదు. ఈ ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించలేదు. పరిహారం ఇవ్వలేదు.
 
 రైతు : నారాయణరెడ్డి 
 గ్రామం : యర్రగుంట, రాప్తాడు మండలం
 ఆత్మహత్య చేసుకున్నది: 29-7-2015
 భార్య, ఇద్దరు కుమారులున్నారు.
 
అప్పుల వివరాలు : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. 2.38 ఎకరాల భూమి ఉంది. భార్య పేరు మీద 4.15 ఎకరాలు ఉంది. పంట రుణం రూ. 31 వేలు తీసుకున్నాడు. ఇందులో రూ. 5,393 రుణమాఫీ అయింది. అనంతపురం కెనరా బ్యాంకులో బంగారంపై రూ. 95 వేలు రుణం తీసుకున్నాడు. ఇందులో రూ. 3,586 మాఫీ అయింది. భార్య నాగేంద్రమ్మ పేరుమీద రూ. 93,595 పంట రుణం ఉంది. ఇందులో రూ. 12,045 మాఫీ అయింది. ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించినా ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. 
మరిన్ని వార్తలు