బాబు స్క్రిప్ట్‌ ప్రకారమే రాధా వ్యాఖ్యలు

25 Jan, 2019 02:33 IST|Sakshi

రాధా తీరుతో రంగా అభిమానులు బాధపడుతున్నారు

వైఎస్సార్‌సీపీ నేత పేర్ని వెంకట్రామయ్య వెల్లడి

చంద్రబాబు వలలో పడి ఆయనలా మాట్లాడుతున్నారు

రంగాను హత్య చేసింది టీడీపీ గూండాలేనని ఎవర్ని అడిగినా చెబుతారు

రంగా అభిమానులు ఈ మేరకు పాటలు కూడా పాడారు

విజయవాడ సిటీ: నలభైయ్యేళ్ల అనుభవంతో రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజకీయాలను అతాలాకుతలం చేస్తున్న చంద్రబాబు వలలో వంగవీటి రాధా పడటం బాధాకరమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. రంగా హత్యకు టీడీపీకి సంబంధం లేదని రాధా అనడంతో లక్షలాదిమంది రంగా అభిమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. గురువారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పేర్ని నాని విలేకరులతో మాట్లాడారు. వంగవీటి రంగాను హత్య చేసింది తెలుగుదేశం గూండాలని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరిని అడిగినా చెబుతారన్నారు. తెలుగుదేశం గుండాలు హత్యచేసినట్టుగా రంగా అభిమానులు పాటలు కూడా పాడటాన్ని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని, రంగా ఆశయాలను ఆయన నెరవేరుస్తారనే అమాయక స్థితిలోకి వెళ్లవద్దని సూచించారు. పేదలకు ఇళ్లు మంజూరు చేయడమే వంగవీటి రంగా ఆశయం అంటే అది రాధా అమాయకత్వమే అవుతుందన్నారు. ప్రతి పేదవాడికి కష్టంలో అండగా ఉండటమే రంగా ఆశయమన్నారు. పట్టుమని 15 రోజుల్లో అధికారం అంతం కానుండగా పేదలకు చంద్రబాబు ఇళ్లు ఇస్తారని రాధా నమ్మడంపై వంగవీటి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సింహం కడుపున పుట్టిన వంగవీటి రాధా.. చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకోవడం నక్కకు కుందేలు దొరికిన విధంగా ఉందని ఎద్దేవా చేశారు. వంగవీటి రంగా నూటికి నూరుపాళ్లు రాజకీయాలకు అతీతుడని, ఆయన యశస్సు రాజకీయాల కంటే ఉన్నతమైందని పేర్ని పేర్కొన్నారు. అలాంటి రంగా విగ్రహావిష్కరణకు వెళ్లొద్దని వైఎస్‌ జగన్‌ ఏనాడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో వాస్తవాలన్నీ తనకు, కొడాలి నానికి తెలుసని చెప్పారు. రాధాకు పొగబెట్టి బయటకు పంపించాలనుకుంటే దేవినేని నెహ్రూను పార్టీలో చేర్చుకునేవారు కదా అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ గురించైతే మాట్లాడొద్దన్నాడు.. 
సోషల్‌ మీడియాలో తనపై వచ్చిన వ్యాఖ్యలపై జగన్‌ తనతో మాట్లాడలేదని రాధా అనడాన్ని పేర్ని ఖండించారు. జగన్‌ పీఏ రాధాను కలవాలని ఫోన్‌ చేస్తే డిసెంబర్‌ 26వ తేదీ తర్వాత వస్తానని చెప్పారని, రాకపోవడంతో మరొకసారి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ రావడంతో తనను విజయవాడ వెళ్లి గుర్తు చేయాల్సిందిగా కోరారని తెలిపారు. ఆ మేరకు రాధాతో మాట్లాడితే..వైఎస్సార్‌సీపీ గురించి అయితే తనతో మాట్లాడవద్దని, వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటేనే  మాట్లాడమని చెప్పినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కూడా రాధా వద్దకు పంపించారని వివరించారు.

ఎన్నికలు తట్టుకోలేని వాళ్లెందరో  వైఎస్సార్‌సీపీలో ఉన్నారు..
పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదని, జగన్‌మోహన్‌రెడ్డే అన్నీ తానై వ్యవహరిస్తాడన్న విమర్శపై పేర్ని స్పందించారు. అంటే మేమంతా ఆత్మగౌరవం లేకుండా, ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నాం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎంత ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీయో ఇటీవల రాష్ట్రానికి వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను టీడీపీ నాయకులు కలిసినప్పుడు చంద్రబాబు ఇచ్చిన వార్నింగే స్పష్టం చేస్తుందని చెప్పారు. వైఎస్‌ జగన్‌ డబ్బులున్నవారికే సీట్లు ఇస్తారనేది సత్యదూరమని,. తనలాంటి ఆర్థికంగా ఎన్నికలు తట్టుకోలేని వాళ్లం చాలా మందిమి పార్టీలో ఉన్నామని పేర్ని తెలిపారు. ఎన్నికల్లో సీట్లు ఎవరికి కేటాయించాలనేది ఆ రాజకీయ పార్టీ వ్యుహాలను బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు