రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

5 Aug, 2018 07:26 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి   

ఓడీ చెరువు : రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఓడీ చెరువు,అమడగూరు,బుక్కపట్నం,కొత్తచెరువు మండలాలకు వాతావరణబీమా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ ఓడీ చెరువులో శనివారం రైతు మహాధర్నా నిర్వహించారు. దుద్దుకుంట మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు బీమా ప్రకటించి, ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

కేవలం నల్లమాడ,పుట్టపర్తి మండలాలకు మాత్రమే అరకొరగా మంజూరు చేసి మిగిలిన ఓడీ చెరువు, అమడగూరు, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాలకు అన్యాయం చేసినట్లు తెలిపారు. 2015లో తుఫాన్‌తో పంట పూర్తిగా పొలాల్లో కుళ్లిపోతే అప్పటి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఐటీ మంత్రి హోదాలో పల్లె  పంటలు పరిశీలించి, ఆదుకుంటామని హామీ ఇచ్చి నేటికీ నయాపైసా ఇవ్వలేదన్నారు. 2016లో పంట పూర్తిగా ఎండిపోయి గ్రాసం కూడా దక్కలేదన్నారు. 2017లో సకాలంలో వర్షాలు కురవ పంట నష్టపోతే వాతావరణబీమా ఇవ్వలేదన్నారు.

 జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే నియోజక వర్గంలోని 193 చెరువులకు హంద్రీనీవా ద్వారా నీరందించి, రైతుల కళ్లల్లో ఆనందాన్ని తీసుకొస్తామన్నారు. రైతు మహాధర్నాలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మలక అశ్వర్థరెడ్డి, కన్వీనర్లు శ్రీనివాసరెడ్డి, శేషురెడ్డి, గంగాధర్‌. మాధవరెడ్డి, రామాంజనేయులు, బీసీ జనసభ మండల అధ్యక్షుడు ఎం.ఎస్‌.షబ్బీర్, రైతులు ఆదిశేఖర్, రామ్మోహన్‌రెడ్డి, కేశవ, రఫిక్, ఆనంద్‌రెడ్డి, ఎద్దుల సతీష్‌రెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు