యువ నేస్తం.. పచ్చి మోసం

3 Oct, 2018 13:54 IST|Sakshi
ఏఎన్‌యూ ప్రధాన ద్వారం వద్ద నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు

నిరుద్యోగులను వంచించే బాబుకు పాలించే హక్కు లేదు

ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం నేత చైతన్య ధ్వజం

కలెక్టరేట్‌ ఎదుట నిరుద్యోగ దీక్ష

ఎస్‌వీఎన్‌ కాలనీ (గుంటూరు): నాలుగేళ్లుగా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యువనేస్తం పేరుతో నిరుద్యోగులను వంచిస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య  ధ్వజమెత్తారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఒక్క జాబైనా కల్పించారా అని ప్రశ్నించారు. జాబులేని పక్షంలో రూ.2 వేలు నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీలనూ ఈ నాలుగేళ్ల కాలంలో గాలికొదిలేసి, తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యువనేస్తం పేరుతో మరోసారి పచ్చిమోసానికి తెరలేపారని మండిపడ్డారు. యువతకు ఆర్థిక స్థిరత్వం భృతితో రాదని, ఉద్యోగాల కల్పనతోనే కలుగుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

అధ్యక్షత వహించిన పానుగంటి చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు భృతి కల్పిస్తానని చెప్పి, నేడు రెండు లక్షల మందికీ భృతిని అందించలేకపోతున్నారన్నారు. యువనేస్తం  పథకంలోనూ సవాలక్ష ఆంక్షలు పెట్టి, ఆశావాహులకు మొండి చేయి చూపడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడకుంటే రాష్ట్ర వ్యాప్తంగా యువత నుంచి ప్రతిఘటన ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నేడు రాష్ట్రంలో 2.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని పరిగణలోకి తీసుకోకుండా నామమాత్రపు భర్తీలతో నోటిఫికేషన్‌లు ఇచ్చే విధానాన్ని చంద్రబాబు తక్షణమే విరమించుకోవాలని కోరారు. అన్ని ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీచేసేలా నోటిఫికేషన్‌లను జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా గ్రూప్‌–2 పోస్టులను గ్రూప్‌–1లో విలీనం చేసే ప్రతిపాదన విరమించుకోవాలన్నారు. జిల్లాలో యువనేస్తం పథకం కింద 40 వేల మంది నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఇందులో 14 వేల మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించడం పథకంలోని లోపాలను బహిర్గతం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు మేరుగ కిరణ్, విఠల్, వినోద్, గంగి, బాజి, జగదీష్, వలి, వర్మ తదితరులు పాల్గొన్నారు.

ఏఎన్‌యూ నిరాహార దీక్ష ప్రారంభం
ఏఎన్‌యూ(గుంటూరు): రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసం చేసేందుకే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ నిరుద్యోగ భృతి డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఏఎన్‌యూ శాఖ అధ్యక్షుడు బుర్ర మహేష్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగులపై చూపుతున్న నిర్లక్ష్యానికికి నిరసనగా పార్టీ విద్యార్థి విభాగం ఇచ్చిన పిలుపులో భాగంగా ఏఎన్‌యూ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏఎన్‌యూ ప్రధాన ద్వారం వద్ద నిరాహార దీక్ష ప్రాంభిం చారు. ఈ సందర్భంగా మహేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు ఉపాధి లేక అలమటిస్తుంటే నాలుగు సంవత్సరాల పాటు వారిని పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు, ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరదీశారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌లకు చిత్తశుద్ధి ఉంటే ఇన్నాళ్లు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలు చేసే నీచ సంస్కృతి చంద్రబాబుదని ధ్వజమెత్తారు. నిరాహార దీక్ష 48 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.  విద్యార్థి విభాగం నాయకుడు నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి అంటూ హడావుడి చేయడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. చంద్రబాబు అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. దీక్షలో విద్యార్థి సంఘ నాయకులు రామకృష్ణ, నాగరాజు, రఘు, రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు