నజరానా వద్దు.. ఉద్యోగం కావాలి!

3 Oct, 2018 13:57 IST|Sakshi

సాక్షి, లక్నో: క్రీడాకారులు పతకాలు సాధించిన వెంటనే.. ప్రభుత్వాలు వారిపై వరాల జల్లు కురిపిస్తాయి. కొద్ది రోజులపాటు మీడియాలో హడావుడి చేసి, కావాల్సిన పబ్లిసిటి వచ్చాక అసలు విషయాన్ని మరిచిపోతాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగం, నగదు కోసం క్రీడాకారులు పోటీల్లో పరుగులు తీసినట్టు ఆఫీసుల చుట్టు పరుగులు తీస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వెటరన్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ సుధా సింగ్‌కు ఎదురైంది. ఆసియా గేమ్స్‌ 2018లో రజతం సాధించిన ఈ క్రీడాకారిణికి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ముప్పై లక్షల నగదుతో పాటు, క్రీడా శాఖలో అత్యున్నత ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. తాజాగా మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు ఆ రాష్ట్ర గవర్నర్‌ రామ్‌ నాయక్‌ సుధాకు 30 లక్షల చెక్‌ను అందచేయగా.. ఆమె తిరస్కరించారు. తనకు కావాల్సింది డబ్బు కాదని ఉద్యోగమని సభా వేదికగా డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులు, యోగి​ బుజ్జగించాక చెక్‌ తీసుకున్నారు. కానీ ఉద్యోగం ఇవ్వకపోతే చెక్‌ వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు.

గతంలో కూడా..
2015లో కూడా అప్పటి ప్రభుత్వం క్రీడా శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి సీఎంను మూడు సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆగ్రహించారు. తాను రైల్వే శాఖలో మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ రాష్ట్ర క్రీడా శాఖలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉందని, యువ ఆటగాళ్లకు చేయుతనివ్వాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్యోగాన్ని కోరుకుంటున్నానని తెలిపారు. క్రీడాకారుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు. తనకు ఇచ్చిన నగదును యువ క్రీడాకారుల శిక్షణ కోసం ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. 

ఇవ్వడం సాధ్యం కాకపోతే చెప్పండి..
తనకు క్రీడా శాఖలో ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెబితే తను వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటానని, యూపీ నుంచి ప్రాతినిథ్యం వహించబోనని స్పష్టం చేశారు. తొమ్మిది సార్లు జాతీయ చాంపియన్‌, ఆసియన్‌ గేమ్స్‌లో బంగారు, రజత పతకాలు, అర్జున అవార్డు సాధించిన తాను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

చదవండి:

సుధా సింగ్‌కు యూపీ ప్రభుత్వ ఉద్యోగం 

మరిన్ని వార్తలు