కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలి

23 Jul, 2018 11:49 IST|Sakshi
కడపలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో బైఠాయించి నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాష, మేయర్‌ సురేష్‌బాబు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ బద్ధంగా కల్పించాల్సిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని తెలుపుతూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి అన్యాయం చేశాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది టీడీపీ మాత్రమేనని ముఖ్యమంత్రి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నిన్నటికి నిన్న పార్లమెంటులో చంద్రబాబునాయుడు నిజ స్వరూపాన్ని ప్రదాని మోదీ బట్టబయలు చేశారన్నారు.


సీఎం వచ్చింది ప్రత్యేక ప్యాకేజీ కోసమే..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చిన సందర్భంలో కేవలం ప్రత్యేక ప్యాకేజీ కోసమే తప్ప మరొకటి కాదని ఏకిపారేశారుని వైఎస్సార్‌ సీపీ నాయకులు తెలిపారు. ప్రజల్లో గూడు కట్టుకున్న ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం వ్యవహారించలేదని, ఇప్పుడు ప్రజలు తిరగబడడంతో ఎక్కడ పార్టీ దెబ్బతింటుందోనని ప్రత్యేక హోదా రాగం ఎత్తుకున్నాడని ప్రదాని నిండు సభలో చెప్పారన్నారు. దీనిపై టీడీపీ నాయకులు, పార్లమెంటు సభ్యులు గుక్కిన పేనులా పడి ఉన్నారని ధ్వజమెత్తారు. పట్టిసీమ మొదలుకొని పోలవరం, ఇతర ప్రాజెక్టులు, అన్న క్యాంటీన్ల వరకు ప్రతి దానిలో కమీషన్లే పరమావధిగా సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు కక్కుర్తి రాజకీయాలు చేశారని దుమ్మెత్తి పోశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా తమ ఎంపీలు రాజీనామాలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు.

టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి మా ఎంపీలతోపాటు నిరాహార దీక్షలో కూర్చొని ఉంటే నేడు రాష్ట్రానికి ఇంత దుర్భర పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈనెల 24వ తేదీన రాష్ట్ర బంద్‌లో భాగంగా జిల్లాలో జరిగే బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అప్జల్‌ఖాన్, మైనార్టీ అధ్యయన, ప్రచార కమిటీ సభ్యులు బీహెచ్‌ ఇలియాస్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, నగర అధ్యక్షుడు ఆదిత్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా, నగర సేవాదళ్‌ అధ్యక్షుడు ఖదీర్, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ (బూస్ట్‌), మాజీ నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి దాసరి శివప్రసాద్, కార్పొరేటర్లు బోలా పద్మావతి, పాకా సురేష్, బాబు, నాయకులు బండి బాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు