రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే..

1 Aug, 2019 08:46 IST|Sakshi
బాధిత కుటుంబానికి చెక్కు అందజేస్తున్న ప్రభుత్వ విప్‌  దాడిశెట్టి రాజా తదితరులు

సాక్షి, తూర్పుగోదావరి : చంద్రబాబు చేసిన పాపాలతోనే నేటికీ రాష్ట్రంలో  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆరోపించారు. కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు బంగారు రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్‌ భరోసా పథకం క్రింద రూ. 7 లక్షల చెక్కును మృతుడి భార్య సూర్యకాంతం, పిల్లలు రమాదేవి, లక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ మీ అప్పులు మా బాధ్యత అని చెప్పీ 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు పీఠం ఎక్కాక రైతులను పూర్తిగా మోసం చేశారన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు బంగారు రాంబాబు మృతి తనను ఎంతో కలచి వేసిందన్నారు.

రాంబాబు మృతి సంఘటన  తెలుసుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ భరోసా సాయాన్ని తక్షణమే అందజేయాలని ఆదేశించారన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ఈ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ కోటనందూరు, తుని మండల కన్వీనర్లు గొర్లి రామచంద్రరావు, పోతల రమణ, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, పార్టీ నేతలు లాలం బాబ్జీ, నల్లమిల్లి గోవిందు, లగుడు శ్రీను, లంక ప్రసాద్, దొడ్డి బాబ్జీ, బొంగు గోపాలకృష్ణ, జిగటాల వీరబాబు, చింతకాయల చినబాబు, రుత్తల జోగిరాజు, కుంచే అచ్చిరాజు, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్,  ఎంపీడీఒ శర్మ, డీటీ కిరణ్‌కుమార్, ఏడీఎ సుంకర బుల్లిబాబు, ఏఒ వాణీ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు