20న ప్రజాప్రతినిధుల ధర్నా: శోభానాగిరెడ్డి

18 Sep, 2013 16:23 IST|Sakshi
20న ప్రజాప్రతినిధుల ధర్నా: శోభానాగిరెడ్డి

హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 20న వైఎస్ఆర్సిపి  ప్రజాప్రతినిధుల ధర్నా నిర్వహిస్తున్నట్లు  శాసనసభలో ఆ పార్టీ  ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి చెప్పారు. తెలుగుతల్లి  విగ్రహం నుంచి అసెంబ్లీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర జరుపుతామని చెప్పారు.  గాంధీ విగ్రహం వద్ద తమ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారన్నారు.  సీమాంధ్ర కాంగ్రెస్,టీడీపీ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

 తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వెనక్కి తీసుకోవాలన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అందరూ రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ,  ఆంటోనీ కమిటీ మీ దగ్గరకు వస్తుందని, రాష్ట్రం ఎలా విడిపోతుందో అప్పుడు చూద్దాం అని ఆమె అన్నారు.

టీడీపీ ప్రజాప్రతినిధులు పదవులు వీడాలి, ప్రజాభీష్టాన్ని గౌరవించాలన్నారు.  తమ లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని టీటీడీపీ నేతలు అంటున్నారు. సీమాంధ్రలో మాత్రం విభజనకు వ్యతిరేకం అంటున్నారు. తెలంగాణలో ఒక విధంగా, సీమాంధ్రలో మరోవిధంగా వ్యవహరించడం మీ విధానమా? అని అడిగారు.  చంద్రబాబూ.. అసలు మీ పార్టీ వైఖరేంటి? అని ప్రశ్నించారు. ఇల్లు గడవకపోయినా సీమాంధ్ర ప్రజలు రోడ్డపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజల ఆవేశాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. తన విధానాలతో చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబూ.. మీ అనుభవమంతా ఏమైంది? అని అడిగారు. మీ అనుభవమంతా కుట్రలు చేయడానికి ఉపయోగపడుతుందని విమర్శించారు. మీ అనుభవమంతా ఉపయోగించి విభజన ఆపండని శోభానాగిరెడ్డి కోరారు.

>
మరిన్ని వార్తలు