ఏపీలో మిన్నంటిన ఆగ్రహ జ్వాలలు

24 Jan, 2020 18:39 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: శాసనమండలిలో ప్రతిపక్ష  టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుకు నిరసనగా విశాఖలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి బిల్లును అడ్డుకున్న టీడీపీకి వ్యతిరేకంగా పెందుర్తి జంక్షన్‌లో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌సీసీ శ్రేణులు మానవహారం నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడి ద్రోహం చేశారంటూ నినాదాలు చేశారు. విశాఖలోనే పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని నినాదాలు చేస్తూ.. చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు శరగడం చిన అప్పలనాయుడు, నక్కా కనకరాజు, యతిరాజుల నాగేశ్వరరావు, వేగి దివాకర్‌, పైల శ్రీనివాసరావు, భగవాన్‌ జయరాం, దాసరి రాజు, నాయుడు తదితరులు పాల్గొన్నారు

అరకులో: శాసనమండలిలో చంద్రబాబు తీరును నిరసిస్తూ అరకులోయలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో ఎమ్మారో కార్యాలయం నుంచి ఎండీవో కార్యాలయం వరకు చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. నాలుగు రోడ్ల కూడలిలో దహనం చేశారు. ఈ నిరసన ర్యాలీలో సుమారు వెయ్యి మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

పాడేరులో: వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పాడేరు అంబేద్కర్‌ కూడలిలో స్థానిక ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారం గా నిలబడి.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. గిరిజన ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా: శాసనమండలిలో చంద్రబాబు వైఖరికి నిరసనగా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలని..వికేంద్రీకరణే ముద్దు అంటూ నినాదాలు చేశారు.  శానసమండలిలో టీడీపీ తీరును నిరసిస్తూ వైస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆస్పరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు,కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. హాలహర్విలో టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్‌సీపీ నేతలు దహనం చేసి నిరసన తెలిపారు. చిప్పగిరి, ఆలూరులో టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

మరిన్ని వార్తలు