జెడ్పీటీసీ రంగారెడ్డి బెయిల్‌పై విడుదల

20 Jul, 2014 01:22 IST|Sakshi
జెడ్పీటీసీ రంగారెడ్డి బెయిల్‌పై విడుదల

మార్కాపురం : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈ నెల 13వ తేదీన అంటే సరిగ్గా జెడ్పీ చైర్మన్ ఎన్నిక రోజు సంతమాగులూరు వద్ద అరెస్టయిన మార్కాపురం జెడ్పీటీసీ రంగారెడ్డి బెయిల్‌పై స్థానిక సబ్ జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, వెన్నా హనుమారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి మాట్లాడారు.
 
తాను ఈ నెల 12వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చేందుకు బస్సులో బయల్దేరానని, సంతమాగులూరు వద్దకు రాగానే మార్కాపురం పోలీసులు బస్సును చుట్టుముట్టి తనను అరె స్టు చేశారని వివరించారు. అదే రోజు ఒంగోలులో జరిగే జెడ్పీ చైర్మన్ ఎన్నికలో తాను ఓటు వేయాల్సి ఉందని, ఎన్నిక తర్వాత తనను అరెస్టు చేయవచ్చని బతిమాలినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేందుకే తనపై కుట్రపన్ని అక్రమ కేసు బనాయించి ఓటు వేయకుండా చేశారని మండిపడ్డారు. బ్రిటీష్ పాలనలో కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదన్నారు.

వైఎస్సార్ సీపీ నాయకులే లక్ష్యంగా పోలీసులు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తనపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణలను రుజువు చేయాలని రంగారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ నేతల నుంచి తాను డబ్బులు తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తనపై అక్రమంగా బనాయించిన కేసుపై ఒంగోలు ఎంపీ, మార్కాపురం ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్తలతో చర్చించి కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ విప్ ధిక్కరించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి డిమాండ్ చేశారు.

ఒక పార్టీకి కొమ్ము కాయవద్దు : మాజీ ఎమ్మెల్యే ఉడుముల
అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ము కాయటం మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఉడుముల శ్రీనివాసులరెడ్డి హితవు పలికారు. రంగారెడ్డిపై అక్రమ కేసులు బనాయించటం దుర్మార్గమన్నారు. చట్టాలకు ఎవరూ అతీతులు కారని, అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తే పోలీసులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛను మార్కాపురం పోలీసులు కాలరాసి రంగారెడ్డిని జెడ్పీ ఎన్నికల్లో  ఓటు వే యనివ్వకుండా అడ్డుకున్నారని రంగారెడ్డి ధ్వజమెత్తారు.
 
టీడీపీ చర్య దుర్మార్గం : వెన్నా హనుమారెడ్డి
రంగారెడ్డిని తీవ్రవాదిగా చిత్రీకరించి జెడ్పీ ఎన్నికల్లో ఆయన్ను ఓటు వేయకుండా అడ్డుకున్న పోలీసులు, టీడీపీది దుర్మార్గపు చర్యని పార్టీ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి అన్నారు. రంగారెడ్డిపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డి.నాగూర్‌వలి, మాజీ ఎంపీపీ నూనె వీరారెడ్డి, పార్టీ నాయకులు పప్పు వెంకటేశ్వర్లు, బట్టగిరి వెంకటరెడ్డి, నారు బాపన్‌రెడ్డి, పార్టీ పెద్దారవీడు మండల కన్వీనర్ గొట్టం శ్రీనివాసరెడ్డి, మొగుళ్లూరి మల్లికార్జునరావు, పట్టణ మహిళా కన్వీనర్ ఆవులమంద పద్మ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు