వారఫలాలు (సెప్టెంబర్‌ 21 నుండి 27 వరకు)

21 Sep, 2019 13:24 IST|Sakshi

జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌!మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (సెప్టెంబర్‌ 21 నుండి 27 వరకు) మీ రాశి ఫలితాలుడా‘‘ మైలవరపు శ్రీనివాసరావుజ్యోతిష్య పండితులు

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
గుర్రం మీద స్వారీ చేయగల శక్తీ నైపుణ్యం అనుభవం ఉన్నప్పుడే ఎలా గుర్రాన్ని ఎక్కాలో లేనిపక్షంలో శరీరంలోని ఏ అవయవం దెబ్బ తినే వీలుందో, అలాగే మీరు ఎన్నుకోబోయే పని ఏదుందో దానిమీద అనుభవం ఉన్నప్పుడే, ఇబ్బంది వస్తే దాన్ని తట్టుకోగల ధైర్యం ఉన్నప్పుడే ఆ పని నిమిత్తం కార్యరంగంలో దూకండి తప్ప, ఎవరి మీదనో ఆధారపడీ లేక ఫలాని వారు సమర్థులనే మాటని వినీ–  ఫరవాలేదు.. దిగులుండదనుకుంటూ కొత్త పనిని – అది వ్యాపారం వృత్తీ ఉద్యోగం– ఏదైనా కావచ్చు– ప్రారంభించకండి. ‘వద్దు’ అని చెప్తూండడం మీకు నచ్చకపోవచ్చునేమోగాని ఇది ప్రధానంగా తెలుసుకోవలసిన అంశం. ఆ మీదట మీ ఇష్టం. పాములకి మాత్రమే రెండు తలలుంటాయనేది మనకు అనుభవంలో తెలిసిన విషయం. అయితే అదే తీరు లక్షణమున్న వ్యక్తులూ ఉంటారు– ఉన్నారు. కాబట్టి ఇటు మీ వైపు తిప్పిన తలతో మీకు అనుకూలంగా మాట్లాడి, అటు మీ శత్రువు వైపు తిరిగి మీ రహస్యాన్ని వారికి చెప్పి మీ పనిని దారుణంగా చెడగొట్టే శత్రువులు– అనుకూలంగా పైకి కనిపిస్తూ చాటుగా ప్రతికూలం చేసేవారున్నారు కాబట్టి అందరినీ విశ్వసిస్తూ–తెల్లగా ఉన్నాయి కాబట్టి పాలే అని అనుకున్నట్టుగా– ఉండకండి. దీన్నే అనుకూల శత్రుత్వమంటారు. నిజంగా శత్రువైతే ఎదురుపడి విరోధిస్తాడు గాని ఇతడైతే మరింత ప్రమాదాన్ని కలిగిస్తాడు. జాగ్రత్త! ప్రారంభించిన పని– అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో– తప్పుగా ఎంపిక జరిగిందనీ, సరైన తీరులో వాటిని ప్రారంభించలేదనీ తెలిసినా– ధర్మబద్ధంగానే వాటినుండి బయటపడండి తప్ప– చెప్పి వదుల్చుకోవడం వంటి పనుల్ని చేయకండి. సమస్య నంండి బయటపడగలుగుతారు కొద్ది అసౌకర్యంతో, ఇబ్బందితో, కొద్దిపాటి ధనవ్యయంతో.

లౌకిక పరిహారం: అనుకూల శత్రువుల పట్ల అప్రమత్తత అవసరం.
అలౌకిక పరిహారం: దేవీ నవరాత్ర కాలం రాబోతోంది కాబట్టి అమ్మ పేరిట సమర్పించుకోవడానికి కొత్త చీరెని సిద్థం చేసుకోండి.

వృషభం (ఏప్రిల్‌ 20 –మే 20)
అష్టమశని నడుస్తున్న కారణంగా ఏ పనిని చేయాలన్నా ఏ తేడా వస్తుందోననే వ్యతిరేక దిశ ఆలోచనలొస్తూ ఉంటాయి. బాగా ఆలోచింప జేయడమనేది మన మంచికే కదా! అయితే సహజంగా మీకుండే కోపం కారణంగా పని చెడిపోయే స్థితి దాకా రావచ్చు కాబట్టి ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోండి చాలు. మాటకి మాటని చెప్పి తీరాల్సిందే అనే దృక్పథంతో ఉంటూ, ముఖ్యమైన విషయాలని గురించి మాట్లాడుతూ కూడా ‘ఎప్పుడు దొరుకుతాడా?’– ఆ చురకని వేసేద్దామనే ధోరణిని మానుకోండి– అంతా విజయమే మీకు. మీ శాంతమే మీ విజయ ఆయుధం. నలుగురిలో మంచి పేరూ ప్రతిష్టలూ కలిగి ఉండడం, ఉండేలా ప్రవర్తించాలనుకోవడం, దానికోసం తాపత్రయపడుతూ ఉండడం అస్సలు సరికాదు. నలుగురిలో ఆ ప్రయత్నాన్ని మీరు చేస్తున్నట్లుగా, చేసుకుంటున్నట్లుగా తేలిపోయే ఏ పద్ధతినీ చేపట్టకండి. చులకన అయిపోతారు. మీరనుకుంటున్నంత  అపకీర్తి మీకేమీ లేదు. గ్రహించుకోండి. చేతికున్న ఐదువేళ్లలా మీ కుటుంబమంతా ఐకమత్యంతో ఉంటూ ఉండడం నిజంగా మహాదృష్టకరం. పెట్టుపోతలూ వినోద విలాస విహార యాత్రలూ అనుకుంటూ సమయాన్నీ ధననాన్ని వెచ్చించుకోవడం కాకుండా కుటుంబంలో అపరిష్కృత సమస్యలేమున్నాయో వాటిని గురించి కొద్ది లోతుగా ఆలోచించుకోవడం, అందరూ సమష్టి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది. వయసు బాగా పైబడిన వాళ్లూ ఏవైనా సూచనలూ సలహాలూ ఇస్తే విని వాళ్లని ఆనందపరచండి తప్ప, చేసేద్దామని గుడ్డిగా అనుకోకండి– నేటి కాల పరిస్థితులూ వ్యవహారాలూ లొసుగులూ... వంటి వాటి మీద వాళ్లకి అవగాహన తక్కువ కాబట్టి మీరే ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి.

లౌకిక పరిహారం: కుటుంబంలో అపరిష్కృత సమస్య గురించి ఓ నిర్ణయానికి రండి.
అలౌకిక పరిహారం: అమ్మవారి నవరాత్రాలకి ఏదో ఓ స్తోత్రం మీద పట్టు సాధించి రోజూ ^è దవండి.

మిథునం(మే 21 –జూన్‌ 20)
ప్రతి పనినీ ముందుగా ఓ ప్రణాళిక వేసుకుని మాత్రమే అమలు చేయాలనే ధోరణితో ఉంటారు. అది సరైన విధానమే. మోయగలిగినంత బరువునే నెత్తికెక్కించుకోవడం మంచిది కాబట్టి స్థలం, పొలం, ఇల్లు మొదలైన వాటిని కొనదలిస్తే ‘దీంతోపాటు...’ అనుకుంటూ మరో ఆస్తి వ్యవహారాన్ని కూడా భుజానికి ఎత్తుకోకండి. ఆర్థికంగా దృఢంగా ఉన్నారు కాబట్టి అనవసర వస్తు సామగ్రి నిమిత్తం ఈ ధనాన్ని వ్యయం చేసేసుకోకండి. సంతానానికి సంబంధించి చదువులూ మొదలైనవాటి నిమిత్తం మీరు వేసుకున్న అంచనాలూ ప్రమాణాలూ ఎప్పటికప్పుడు మారిపోతాయనే ముందు చూపుతో ధనాన్ని నిల్వ చేసుకోవాలనుకోవడం తప్పనిసరి. ఎదుటివారితో పోటీ దృక్పథం కలిగి విరాళాలని ఈయాలనుకోవడం, నలుగురిలో పేరు ప్రతిష్ఠలకి నిల» డాలనుకోవడం ఏమాత్రమూ సరికాదు. విరాళాన్ని ఈ పరిస్థితుల్లో ఈయలేనని చెప్పినా నష్టమేమీ ఉండబోదు మీ ప్రతిష్ఠకి. గుర్తుంచుకోండి. ఎవ్వరూ వేలు చూపేలా మీ ప్రవర్తన ఉండదు. అది మీ అదృష్టం. గోడని ఎక్కుతూ ఉండే సాలెపురుగు ఎన్ని మార్లు ఏవేవో కారణాలతో నేలన పడిపోతూ కూడా, మళ్లీ ఎలా ప్రయత్నిస్తూనే ఉంటూ మొత్తానికి గోడపైకి ఎక్కగలుగుతుందో ఎక్కుతోందో అదే తీరు మనోధైర్యంతో నూతనోత్సాహంతో మీరుంటారు. ఆ స్థాయితో ఆ స్థితితో మాత్రమే ముందుకి సాగిపొండి. విజయమనేది మన మనోధైర్యంలో దాగి ఉంటుందనేది నిజం. ఏ తీరుగానూ దుఃఖించవలసిన సందర్భాలు లేవు ఈ వారంలో. మొహమాటానికి పోయి ఇతరుల పనుల్ని చక్కబెట్టే నిమిత్తం దూర భార ప్రయాణాలని చేయవలసి వస్తే శారీరక శ్రమని చూసుకుని మాత్రమే ప్రయాణించండి. కానిపక్షంలో రాలేనని నిర్భయంగా చెప్పెయ్యండి.

లౌకిక పరిహారం: ఎత్తుకోలేని బరువుని ఎత్తుకోకండి.
అలౌకిక పరిహారం: అమ్మవారి పూజ కోసం వస్తు ద్రవ్యాలని ముందుకి ముందే సిద్ధం చేసుకోండి.

కర్కాటకం(జూన్‌ 21 –జూలై 22)
కేవలం ధనం సంపాదనం అనేదే ధ్యేయంగా ప్రవర్తిస్తూ అతి ముఖ్యమైన పనుల్ని చేయకుండా వాటిని వాయిదా వేసుకుంటున్నానా? అని మీకు మీరు ఏకాంతంగా ఆలోచించుకోండి. సంసారమంటూ మీకొకటి ఏర్పడ్డాక అందరి ఎదుగుదల కోసం ప్రయత్నిస్తూ ఆ అందరి వెనుకా మీ ఎదుగుదల గురించి చూసుకుందామనే దృక్పథంతో ఉండండి. మీరేదైనా కళాకారులూ వినోదరంగానికి చెందిన వారూ.. అయ్యుంటే మీకు జరుగుతున్న సంమానాలకి సంబరపడిపోకండి. తాత్కాలికంగా జరిగే సంమానాల కంటే శాశ్వతంగా మీ పేరు నిలబడిపోయే తీరులో ఏదో ఒక పెద్ద పనికి శ్రీకారం చుట్టుకోండి. ఇది అనుకూల సమయం. భూమిమీద పడ్డ వస్తువు రోజు రోజుకీ కొంత దుమ్ముని సేకరించుకుని క్రమంగా భూమిలో కప్పబడిపోతుందో అలా ఎవరి పేరు ప్రతిష్ఠలైనా నిలిచేది కొంతకాలానికి మాత్రమే అనే ధ్యేయంతో ఉండండి తప్ప, కుటుంబాన్ని పట్టించుకోకుండా ప్రవర్తించకండి. ఇది మరింత ముఖ్యమైన విషయం కాబట్టే వివరంగా చెప్పవలసి వచ్చింది.
మీకు ఏదో ఓ తీరుగా సహకరించాలనే ఇష్టంతో మీ మీది గౌరవంతో ఓ కొద్దిమంది సహాయ పడడం కోసం వస్తారు. గౌరవాన్నీ పరిచయాన్నీ చెడగొట్టుకోకుండా ఉండే స్థాయిలో ఆ సహాయాన్ని వినియోగించుకోండి. ఆర్థికంగా ఏమాత్రమూ వాళ్లకి ఇబ్బంది కలక్కుండా చూసుకోండి. వ్యవసాయం బాగుంటుంది. ధనాదాయం బాగుంటుంది. కుటుంబ ఐకమత్యం కూడా ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత మధ్యంగా ఉండచ్చు కాబట్టి ఇద్దరిలో ఒకరు కొంత చొరవ తీసుకుని దాంపత్యం అనుకూలత కోసం ప్రయత్నించడం మంచిది. కుటుంబ– దాంపత్య అనుకూలతకి మించిన ఐశ్వర్యం లేదని గ్రహించుకోండి.

లౌకిక పరిహారం: కుటుంబ అభివృద్ధికి ప్రాధాన్యాన్ని ఇయ్యండి.
అలౌకిక పరిహారం:: అమ్మవారి సామూహిక కుంకుమ పూజ నిమిత్తం తగినంత కుంకుమని సిద్ధం చేసుకోండి.

సింహం(జూలై 23 –ఆగస్ట్‌ 22)
లోకంలో అందరికీ పని చేస్తుంటే ఆ శ్రమకి అలుపు, ఆయాసం వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనిపిస్తుంది. అదే మరి గుర్రమైతే ఎంత పరుగెత్తుతూ ఉంటే అంత అలుపు ఆయాసం దానికి రాదట. అలా శ్రమించడమే కర్తవ్యంగా భావించే లక్షణం, పని పూర్తయ్యే వరకూ విశ్రమించని విధానం మీది. ఆ కారణంగా పనులన్నీ ఈ మంత్రం కారణంగానే విజయవంతం అవుతాయనేది నిజం. అయితే ఓ చిన్నది తెలుసుకోవలిసినది ప్రస్తుతం మీకు సాగుతున్న దశ ప్రకారం ఉంది. అదే అనారోగ్యం. ఆ మధ్య మీకు ఏదైనా శస్త్ర చికిత్సగాని దానికి సరిపడినంత అంటే దాదాపుగా ఆ స్థాయి వరకూ వచ్చి మందులతో సరిపడిన అనారోగ్యం బాగా వచ్చి ఉండవచ్చు. అదే మీకు పరోక్షంగా తెలియజేస్తుంది ఆరోగ్యం అనే పేరున్న నన్ను జాగ్రత్తగా చూసుకోవల్సిందని మర్చిపోకండి. ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని మందులు వేసుకోవడమనేది రెండవ ఉపాయం. అసలు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా ఉండే తీరులో శరీరానికి విశ్రాంతిని, ఇంటి భోజనాన్ని, సకాల నిద్రని ఏర్పాటు చేసుకోవడం మొదటిది ముందు ఈ పద్ధతిని పాటించడం ఎంతైనా అవసరం. ప్రస్తుతం మీరు ఒక్కరూ పనిని చేయగలిగిన బుద్ధి శక్తి ఆర్థిక సహాయ సంపత్తీ వ్యక్తుల భౌతిక సహకారంతోనూ ఉండవచ్చు. అయినా పనిని పదిమందికి సమానంగా పంచి మొత్తం భారాన్ని మీమీదే పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఇదేదో అనారోగ్య దృష్టితో చెప్పే మాట కాదు. మీ విజయంలో పదిమందికి భాగస్వామ్యమున్న పక్షంలో ఒక్కడే బాధపడిపోతున్నాడనే తీరు ఆలోచన ఇతరులకి ఉండదు. చర్మానికి సంబంధించిన అనారోగ్యం లేదా జీర్ణ క్రియకి చెందిన అనారోగ్యం గాని వస్తే వైద్యుని వద్దకెళ్లి తాత్కలికంగా వైద్యసహాయాన్ని  పొందండి. ఆ వ్యాధి మొక్క దశలోనే నివారింప వీలవుతుందనేది దీని భావం. ఇంతకు ముందే అజీర్ణ చర్మ వ్యాధులుంటే  పెరగకుండా వైద్య సహాయాన్ని పొందండి.

లౌకిక పరిహారం:మొత్తం పనిని మీరొక్కరే నెత్తిన పెట్టుకోకండి. ఆరోగ్యాన్ని గమనించుకుంటూ ఉండండి.
అలౌకిక పరిహారం: అమ్మవారి పూజ నిమిత్తం వస్తు సామగ్రిని తోమి శుభ్ర పరుచుకుని సిద్ధమై ఉండండి.

కన్య(ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
నూతిలో చేదని వేసి ఆ చేద నిండి ఉన్నప్పుడూ అది నీళ్లలోనే ఇంకా ఉన్నప్పుడు చాలా తేలికగా అన్పిస్తుంది. నీటిమట్టాన్ని దాటి పైకి ఆ చేద రాగానే బరువుని స్పష్టంగా తెలియజేస్తుంది. సరిగా ఇలాగే మీరు ఓ ముఖ్యమైన పనిని ప్రారంభించే సందర్భంలో తేలిక అనుకున్నది కాస్తా సమయం ధనం శ్రమ ....అనే అన్నిటిలోను బరువే అన్పించవచ్చు. అయినా దిగారు కాబట్టి పూర్తి చేసుకోవాలనుంటే తప్పనిసరిగా పూర్తి చేసుకోగల్గుతారు. మీకు మనోధైర్యం చాలా ఎక్కువ కాబట్టి ధర్మబద్ధంగా వెళ్లడమే మీకు ఇష్టమైన విధానం కాబట్టి పనుల్లో ఇబ్బందులు రావు. ఒకవేళ ఏవైనా ఒకటీ అరా వస్తున్నా ముందునాటికి రాబోయే పెద్ద ఇబ్బందుల నుంచి రక్షించేవి అని అర్థం చేసుకుని పరిష్కరించుకోండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించదలిస్తే అనుకూలమే అవుతుంది కాబట్టి త్వరలో ప్రారంభించుకోవచ్చు ముహూర్తానికి అనుగుణంగా. లోగడ మీతో వివాదపడ్డ వ్యక్తులెవరైనా మీకు ఆర్థిక భౌతిక సహాయాన్ని అందించదలచినట్లయితే సున్నితంగా తిరస్కరించండి తప్ప చేర్చుకోవద్దు. భాగస్వాములతో వ్యాపారాన్ని ప్రారంభించటం కంటే భాగస్వామ్యం కోరే వారినుండి కేవలం ఋణాన్ని మాత్రమే తీసుకుని నూతన వ్యాపారాన్ని చేయదలుచుకోవడం మంచిది వ్యసనానికి లోనయ్యే అవకాశం కన్పిస్తుంది కాబట్టి జాగ్రత్త ఇంతకుముందే వ్యసనపరులైతే ఆ వ్యసన ముసుగులో మిమ్మల్ని వంచించేవారున్నారనే ఆలోచనతో తప్పక అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏమైనా మీ శ్రమ వృధా పోదు. శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందకుండా ఉండరు. ఆస్తులకి సంబంధించిన పత్రాలని ఒకసారి పూర్తిగా పరీక్షించుకుని భద్రంగా ఉన్నదీ లేనిది గమనించుకోండి.

లౌకిక పరిహారం: ఏ పని తలచినా ఆ పనిని బరువుతో అవుతుందని సిద్ధపడి ఉండండి.
అలౌకిక పరిహారం: అమ్మవారి భజనని ఇంట్లో చేయించుకునేందుకు తగిన ప్రయత్నాన్ని ప్రారంభించండి.

తుల(సెప్టెంబర్‌ 23 –అక్టోబర్‌ 22)
తాడుని ఆ చివర పట్టుకుని కొందరూ ఈ చివర పట్టుకుని మరికొందరూ లాగడం ప్రారంభిస్తే తప్పక ఒకరు విరమించుకోవడం గాని, తాడు తెగిపోవడం గాని జరిగి తీరుతుంది. అదే తీరుగా మీరూ మీ శత్రుపక్షం వారూ ఒకే సమస్యని ఎంత దూరం తీసుకుపోవాలో అంతదూరమూ సాగదీసుకుంటూ ఆర్థికంగానూ సమయం దృష్ట్యా ఎంతో నష్టపోగొట్టుకుంటున్నారు. విలువైన జీవిత సమయాన్నీ కష్టించి ఆర్జించిన ధనాన్నీ వ్యర్థ పరచుకోవడం కంటె సరైన మధ్యవర్తి ద్వారా ఎంతో ఒకంతకి ఏదో ఒకవిధంగా ఎలాగో ఒకలా పరిష్కరించుకోవడం మంచిది. ఉగాదిలోగా ఈ పరిష్కారానికి అనుకూలం కాబట్టి వడిగా అడుగులని వేయండి. వాళ్లని కూడా వేసేలా చేసుకోండి. ఇలా చెప్పగలగడానికి కారణం అటువైపు వారు కూడా దాదాపుగా ఇదే ఆలోచనలో ఉండి ఉంటారు కాబట్టి. తక్కువ సొమ్ముకే వచ్చేస్తోందనే అభిప్రాయంతో సరైన పత్రాలు లేని– వాగ్దానం లేదా హామీగా గాని ఎవరో ఉన్నారనే తీరుగా ఉన్న ఆస్తుల్ని ఏవిధంగానూ కొనే ప్రయత్నాన్ని చేయొద్దు. కొంతకాలమయ్యాక పత్రాలనిస్తామంటూ చెప్తే దానికిగానూ బయానా ఇయ్యద్దు. అంగడిలో వస్తువుని సొమ్మిచ్చి తెచ్చుకున్నట్లుగా వ్యవహారం ఉన్నప్పుడే ముందకి సాగండి. ఇది నిష్కర్షగా చెప్పే విషయం. సంతానం మీ మాటకి కట్టుబడి మాత్రం తాత్కాలిక మనఃస్పర్ధ ఉన్న కారణంగానే విషయం జరిగిపోతూ ఉండచ్చు. ఎదురు బదురుగా దంపతి కూర్చుని ఎవరి ప్రమేయమూ లేకుండా– ఒకటి రెండుమార్లు గాని మాట్లాడుకున్న పక్షంలో సమస్య– అతి సులభంగా అర్థం అవుతుంది. అద్దాన్ని ఏటవాలుగా పెడితే ఆ పెసరగింజ దొర్లిపోయినట్లుగా పరిష్కరింపబడుతుంది కూడా. ఆలస్యం మీదే. అర్థం చేసుకోండి.

లౌకిక పరిహారం: సమస్యా పరిష్కారానికి మధ్యవర్తి దిశగా– ఓ ఆలోచనని చేయండి.
అలౌకిక పరిహారం: అమ్మవారి పూజకి కావలసిన పుష్పాలపై ఓ అవగాహనకి రండి.

వృశ్చికం(అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
బండి నిండుగా చెప్పలేనంత బరువుని వేసి– మర్చిపోయాననుకుంటూ ఇంకొంత బరువైన వస్తుని బండి కాడి కింద కట్టినట్లు, ఇప్పటివరకూ మీ మీద వేసిన న్యాయ అభియోగాలకి తోడుగా మరొకదాన్ని కూడా సంధించవచ్చు. దిగులు పడకండి. ‘పెరుగుట విరుగుట కొరకే!’ అన్నట్టు విజయం మీ పక్షమే. దైర్యంగా ఉండండి. శత్రుపక్షం వారు పరోక్షంగా కవ్వించినా వాద వివాదాలు చేయకండి. మీరుగా వాళ్లకి ఏ వర్తమానాన్నీ పంపకండి. చేయని పొరపాటుకి, నడవని ఆ తీరు ప్రవర్తనకీ శిక్ష పడటం లౌకికంగా నిజం కావచ్చునేమో గాని, అలౌకికంగా అంటే దైవం ముందు నేరమే ఔతుంది కాబట్టి దైవాన్ని మరింత ధ్యానిస్తూ ఉండండి. ఎక్కువ ఆలోచన కారణంగా శిరోవేదన గాని స్వల్పంగా నేత్రవ్యాధిగాని వచ్చే అవకాశముంది కాబట్టి అప్రమత్తగా ఉండండి.
ఒకప్పుడు భయపడినంతా, భయపడాల్సినంతా పరిస్థితులు దగ్గరలో లేవు. అయితే నోటిని మాత్రం అదుపులో ఉంచుకోవాల్సిందే. మీ సమస్యని నేను పరిష్కరించగలనంటూ ఎవరైనా మీ వద్దకొస్తే అక్కరలేదని నిష్కర్షగా చెప్పండి తప్ప వివరాలని అందియ్యకండి. మన లో అభిప్రాయాన్ని గమనించ వచ్చిన వ్యక్తులే తప్ప, నిజంగా సహాయపడే వానిగా ఆ వ్యక్తిని లెక్కించకండి. కొత్త ఆస్తుల్ని కొనగలిగిన శక్తి ఉన్నా ప్రస్తుతం ఆ ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. కాలం కలిసిరాని కాలంలో ఏ పనిని చేసినా అది తాడుగా ఉండదు– తాచుపాముగా అవుతుంది కాబట్టి. మీ బంధువులందరితో సత్సంబంధాలుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి. అన్నీ బాగానే ఉన్నా జీవిత భాగస్వామితో వచ్చిన కలహమే మానసికంగా బాధని కలిగిస్తూ ఉంటుంది. దగ్గరకొచ్చేస్తారు. భయపడకండి.

లౌకిక పరిహారం: మనోధైర్యాన్ని సడలించుకోనవసరం లేదు. భయపడకండి.
అలౌకిక పరిహారం: అమ్మవారి పూజకి కావలసిన మంచి ఆవునేతిని సిద్ధం చేసుకుని ఉండండి.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఉన్న పరిచయాన్ని తక్కువ కాలంలోనే ఎక్కువెక్కువ చేసుసుకుంటూ వెళ్తే ఒకరిమీద ఒకరికి గౌరవాలు పోతాయి. అలాగే అస్తమానం ఒకే ఇంటికి వెళ్తూంటే పరిస్థితి అమర్యాదతో పాటు అవమానింపబడే దాకా వస్తుంది– ఈ సూత్రాన్ని బాగా గుర్తుంచుకుని ప్రవర్తించాల్సిన వారం ఇది. అగౌరవం అమర్యాద అవమానమనేవి మనకి భౌతికంగా ఇబ్బందిని కల్గించేవి కావు గాని, మానసికంగా తీవ్ర వ్యధనిస్తాయి. శారీరకమైన వ్యాధికంటె గొప్పది మానసికమైన బాధ. గమనించుకోగలగాలి. ప్రయాణాలు చేయాల్సి వస్తే తగినంత ఆరోగ్యం ఆర్థికస్థితి వీటితో పాటు అవసరమా? అనవసరమా? అని బాగా ఆలోచించుకుని మాత్రమే ప్రయాణానికి సిద్ధపడండి తప్ప, వెంటనే బయలు దేరకండి. తోడబుట్టినవారితో ఏ విధంగానూ విరోధించకండి. మీ విషయాన్ని తమ చేతిలోనికి తీసుకుని తమంత తాముగా వ్యవహారాన్ని చేసేసే చనువుని ఎవరికీ ఇయ్యకండి. ఏదో చిన్న పరిచయంతో విషయాన్ని ఎవరికీ తెలియజేసినంత మాత్రాన అంత వేగంగా ఆ పరిచయాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదనే అభిప్రాయం అవతలివారికి అర్థమయ్యేలా సున్నితంగా చెప్పండి. ఇక మరోసారి వారితో ఏ విషయాన్నీ ప్రస్తావించకండి. ఈ వారంలో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి గాని శారీరకంగా మంచి ఒత్తిడికి మాత్రం గురికావడం తప్పకపోవచ్చు. ప్రస్తుత దశలో మీ అధికారి మిమ్మల్ని వ్యతిరేకించడు కాబట్టి ఉన్నదున్నట్లుగా చెప్పి మీకు కలుగుతున్న మరింత ఒత్తిడిని ఆయనకి గాని వివరించుకున్నట్లయితే అనుకూల పరిష్కారం జరగచ్చు మీకు. శని అననుకూలునిగా ఉండబోతున్నాడు కాబట్టి ఎదుటి నుండి వచ్చే వివాదాలు పరిష్కరింపబడతాయి గాని, మీకు మీరుగా వివాదపడితే దానికి పరిష్కారం కొద్ది అసాధ్యం కావచ్చు.

లౌకిక పరిహారం: మీకు మీరుగా వివాదానికి తెరతీయొద్దు.
అలౌకిక పరిహారం: అమ్మవారి అలంకారాలని చూసేందుకు ఎక్కడికెళ్లాలో ఓ ఆలోచనని చేసుకోండి.

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కొత్తగా కలిగిన సంతానంతో గాని, కొత్తగా కట్టుకున్న ఇంటి సౌఖ్యంతో గాని ఉంటూ ఆనందపడుతూ ఉంటారు. ఆర్థికమైన ఆధిక్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్నే నిజమైన ఆనందంగా భావించకండి. ‘అశాశ్వతమైనది కేవలం ధనం’ అనే భావనని గట్టిగా కలిగి ఉన్న పక్షంలో ధనం గూర్చిన తీవ్ర ఆలోచనలు రావు. మనసు మన అదుపులో ఉంటుంది కూడ. ఎవరైనా మీ విషయంలో ఓ అభియోగాన్ని మీ మీద మోపుతూ మీ పరోక్షంలో ఎవరితోనైనా మాట్లాడినా, లేక మీ మీద ఎవరైనా ప్రత్యక్షంగానే నిందని మోపినా, వెంటనే స్పందించెయ్యకండి. నిజానిజాల దృష్టితో గనుక ఆలోచిస్తే నిందకి గల మూలకారణం తెలియకమానదు. ఆ నింద అనేది నిజంగా పుట్టిందేనా? లేక మీ మీద ఆసూయ కారణంగా వచ్చిందా? అని గమనించుకుని మీ మీది అక్కసుతో నిందని వేసి ఉంటే అప్పటికప్పుడే వెళ్లెయ్యడం కాకుండా ఒక ప్రశాంత సమయంలో ఓ ఇద్దరితో కలిసి వెళ్లి వాగ్వివాదం లేకుండా సమస్యా పరిష్కారాన్ని కలిగించుకోండి. ఒకరి విషయంలో మధ్యవర్తిత్వానికి వెళ్లేందుకు అనుకూలించే కాలం కాదిది. అలాగని మీ విషయానికి ఎవరైనా మధ్యవర్తిగా ఉండదలిస్తే కూడ– ‘అంతగా అవసరమైతే పిలుస్తాను గదా! మీకంటె అప్తులు మీకెవ?’రంటూ వారి సహాయాన్ని కోరకండి. శాంతపరిచి పంపెయ్యండి. ఇదేతీరుగా ఈ వారంలో రుణాన్ని ఇయ్యకండి. రుణాన్ని పొందకండి కూడ. వచ్చిన సొమ్ముని పిల్లల చదువులకే ఎంత అవసరమో మీకు ఓ అవగాహన ఉంది కాబట్టి, ఆ పై సొమ్ముని మాత్రమే ఖర్చు చేయతగినదనే ఓ తీరు నిర్ణయానికి రండి.

లౌకిక పరిహారం: వాదవివాదాలు చేయదగిన కాలం కాదిది.
అలౌకిక పరిహారం: అమ్మవారి లలితాసహస్రనామాలని చదువుతూ తప్పుల్ని పెద్దలతో సరిదిద్దించుకోండి.

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
దేవాలయానికి వెళ్లాల్సిందే. మంచిదే. ‘అతి’సరికాదు. ఎవరో ఒక తెలిసిన వైద్యుని దగ్గరికి వెళ్లడం అనారోగ్య నివారణకి అవసరమే. అయితే అనేక వైద్యులొద్దు. అది సరికాదు. ఇదే తీరుగా మీరు చేయదలిచిన పనికి సలహా సూచన అనేదాని కోసం ఎందరినో సంప్రదించడం సరికాదు. పెద్దలూ ఆ పనిలో అనుభవజ్ఞులూ అయినవారితో సంప్రదింపులు మాత్రమే సరి. కుటుంబసభ్యులందరినీ కూచోబెట్టి, వాళ్లు మరీ అవగాహన చేసుకోలేనంత చిన్న వయసువాళ్లూ లేదా దూరప్రదేశాల్లో చదువుల కోసం ఉంటున్నవాళ్లూ ఏదా దూర ప్రదేశాల్లో చదువుల కోసం ఉంటున్నవాళ్లూ గాని అయితే మొత్తం అందరికీ ఎలాగో ఒకలా మీరు చేయబోతున్న, చేపట్టబోతున్న పనిని గూర్చి దాపరికం లేకుండా చెప్పండి. సమాచారాన్ని చేరవేయండి. ఎక్కడైనా ఇబ్బందంటూ వచ్చిన పక్షంలో అండాదండా మీకుంటుంది. మొత్తం కీర్తి మీకే రావాలనుకున్నా – సర్వ సమర్ధుడనే బిరుదాన్ని పొందాలనుకుంటూ అత్యుత్సాహంతో పనికి దిగినా – ఏదో చిన్నపొరపొచ్చెం జరిగితే కథ వేరుగా ఉంటుంది. బరువున్న వస్తువుని నలుగురూ నాల్గువైపులా మోయడం మంచిది. గ్రహించుకోండి. మీకెంత ఆప్తులైనా సరే మీ వద్దకొచ్చి కొంత బంగారాన్నో ధనాన్నో లేక విలువైన పత్రాలనో కొన్నాళ్లపాటు దాచి ఉంచవలసిందిగా కోరే అవకాశముంది. మరీ దగ్గరివారైతే లౌక్యంగానూ, కొద్ది దూరం వారే అయినట్లయితే నిర్ద్వంద్వంగానూ తిరస్కరించండి తప్ప వాటి భద్రతకోసం మాటనియ్యకండి. దాచి ఇబ్బందికి గురికాకండి. వయసు పెద్ద అయినవాళ్లకి తేలికైనా తాత్కాలిక వైద్య పరీక్షలని చేయించండి. అవసరమనిపిస్తే ఆ మీదటి వైద్యస్థాయికి వెళ్లచ్చు. ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ అనారోగ్యపు ఇబ్బందులు ఎవరికీ లేకపోవచ్చు.

లౌకిక పరిహారం: కుటుంబసభ్యులకి చెప్పకుండా దేన్నీ చేపట్టకండి.
అలౌకిక పరిహారం: అమ్మవారి కీర్తనలని పాడడానికి కొంత అభ్యాసం చేస్తూ ఉండండి.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అనుకున్న పనులన్నీ సరైన తీరులో పూర్తవుతున్న కారణంగానూ, ‘పనిలో పని’ అన్నట్లుగా మరో పనిని ప్రారంభించడం సరికాదనే తీరుని గుర్తించి కొత్తపనిని విరమించిన కారణంగానూ కుటుంబం మొత్తం ఆనందపడుతూ ఉంటుంది. చెప్పుకోదగ్గ విషయం ఇది. ధనాన్ని సమయాన్నీ వెచ్చిస్తే పనులు పూర్తి ఔతాయనేది నిజమే కాని, ఈ పనిలో విజయం సాధించడం ద్వారా మీకు ఆత్మవిశ్వాసం పెరగడమనేది నిజంగా లభించిన లాభం– దాన్ని కోల్పోకుండా ఉండండి. ఎప్పటి నుండో అమ్మకం కాకుండా ఉన్న మీ ఆస్తి – స్థలమో పొలమో ఇల్లో ఫ్లాటో.. మొదలైనవాటిలో అమ్మకపు చలనం ప్రారంభమౌతుంది. ఇన్నాళ్లూ అది అమ్మకం కాని కారణంగా న ష్టపోయిన ద్రవ్యలాభాన్ని దృష్టిలో ఉంచుకునీ, మరికొంతకాలం అలాగే ఉంటే రాబోతున్న నష్టాన్నీ ఎంచుకుని – కాళ్ల దగ్గరకొచ్చిన బేరాన్ని – కాదనుకోకుండా ముగించుకోండి. అనుకున్నంత లాభమైతే రాకపోవచ్చు గాని, నష్టం మాత్రం రాదు. మానసిక చింత లేకపోవడం అనేది మీకు కలిగే అత్యంత లాభంగా భావించండి. పిల్లల్ని పెద్ద పెద్ద చదువుల్ని చదివించడం కోసం ఎక్కడెక్కడికో పంపేందుకు చేసిన అతిమాత్ర వ్యయం, దానికి సంబంధించిన రుణం అలాగే వడ్డా మొత్తం తీరిపోయే అవకాశముంది ప్రస్తుతం. ఆస్తుల్ని చూసుకుంటూ, వాటి ధరలు పెరిగినప్పుడల్లా లెక్కించుకుని ఆనందపడడం కంటె ఉన్న అప్పుల్ని తీర్చేసుకుని మనస్సౌఖ్యంతో ఉండాలని మీ జీవిత భాగస్వామి చెప్తూ ఉండి ఉండవచ్చు – వినండి. దుఃఖభారాన్ని పదిమందితో పంచుకుంటే ఎలా ఆ దుఃఖం తరుగుతుందో, అదే తీరుగా ప్రస్తుతం మీకున్న ఈ సౌఖ్యాన్నీ ఆనందాన్నీ – నిజమైన అవసరంలో ఉన్నవారిని గుర్తించి వాళ్లకి సహాయపడుతూ – పంచుకోండి.

లౌకిక పరిహారం: యధాశక్తి ఒకరికి ఏ తీరు సహాయమవసరమో అలా సహాయపడండి.
అలౌకిక పరిహారం: అమ్మవారి అలంకారాలన్నీ దర్శించే వీలుగా పనుల్ని సర్దుకోండి. నిత్యదర్శనం మానకండి.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు