తెలుగు రాష్ట్రాల్లో 1,600 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లు

7 Jan, 2019 05:41 IST|Sakshi

ఆంధ్రా బ్యాంకు ప్రణాళిక

న్యూఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్తగా 1,600 మంది బిజినెస్‌ కరస్పాండెంట్స్‌ (బీసీ)ను నియమించుకోనుంది. బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, ఇంటి వద్దకే బ్యాంకింగ్, ఏటీఎంల ఏర్పాటు, మొండిబాకీల రికవరీ మొదలైన వాటికి వీరి సేవలను వినియోగించుకోనుంది.

2019 జనవరి 31 నాటికల్లా బీసీల నియామకాలు జరిపే ప్రక్రియ పర్యవేక్షణ కోసం కార్పొరేట్‌ బిజినెస్‌ కరస్పాండెంట్స్‌ (సీబీసీ) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆంధ్రా బ్యాంక్‌ రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) ప్రచురించింది. దీని ప్రకారం 2019 మార్చి ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 922 మంది, తెలంగాణలో 695 మంది బీసీలను నియమించుకోనుంది. బ్యాంకులకు అనుసంధానమైన స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) మొదలైన వాటికి బీసీ ఏజెంట్లుగా నియామకంలో ప్రాధాన్యం ఉంటుందని బ్యాంకు వివరించింది.

బ్యాంకు ఆమోదించిన.. రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగులు, రిటైర్డ్‌ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, కిరాణా షాప్‌ ఓనర్లు, ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్న డీలర్లు, రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ మొదలైన వారు కూడా దీనికి అర్హులు. ప్రస్తుతం సీబీసీ విధానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు,   ఛత్తీస్‌గఢ్, బిహార్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రా బ్యాంకు సుమారు 2,200 మంది బిజినెస్‌ కరస్పాండెంట్స్‌ను నియమించుకుంది.  

మరిన్ని వార్తలు