పవన విద్యుత్‌కు ఎదురుగాలి

18 Aug, 2017 00:11 IST|Sakshi
పవన విద్యుత్‌కు ఎదురుగాలి

అమ్మకానికి 3,000 మెగావాట్ల ప్రాజెక్టులు
పన్ను రాయితీలు ఎత్తివేత  
తగ్గిపోతున్న యూనిట్‌ విద్యుత్‌ రేటు.. రూ.3.46కు చేరిక రాష్ట్రాల నుంచి అందని మద్దతు  
వదిలించుకునే పనిలో పడ్డ యాజమాన్యాలు


న్యూఢిల్లీ: గాలితో నడిచే కాలుష్య రహితమైన, పర్యావరణహితమైన పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. దీనికి తట్టుకోలేక పవన విద్యుత్‌ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు విక్రయించి వచ్చినంత సొమ్మును జేబులో వేసుకునే పనిలో పడ్డాయి. మారిన పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు.... ఫలితంగా ఈ రంగానికి కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల పరిధిలో 3,000 మెగావాట్ల సామర్థ్యంగల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు రూ.15,000 కోట్లకు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.  

కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్టు... పవన విద్యుత్‌ రంగం గడ్డు పరిస్థితులకూ పలు కారణాలున్నాయి. పన్ను ప్రయోజనాలు తగ్గిపోవడం, పోటీ బిడ్డింగ్‌ విధానంతో విద్యుత్‌ కొనుగోలు ధరలు (టారిఫ్‌) రోజురోజుకీ కనిష్ట స్థాయికి చేరుతుండటం, అదే సమయంలో రాష్ట్రాల నుంచి సంప్రదాయేతర విద్యుత్‌కు డిమాండ్‌ పెరగకపోవడం ఇవన్నీ పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. దీంతో పరిస్థితులు మరింత దారుణంగా మారకముందే చాలా మంది పవన విద్యుత్‌ ప్రాజెక్టులను విక్రయించుకునే పనిలో పడ్డారు.  

ప్రోత్సాహకాలకు చెల్లు
ప్రస్తుతం అమ్మకానికి వచ్చిన 3,000 మెగావాట్ల ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం ఇంధనేతర కంపెనీల చేతుత్లో ఉన్నవే. ప్రముఖ సిమెంట్‌ కంపెనీలు, స్టీల్‌ కంపెనీలు, విదేశీ కంపెనీలకు చెందిన భారతీయ విబాగాలు వీటిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులపై ఐటీ చట్టం కింద యాక్సిలరేటెడ్‌ డిప్రీసియేషన్‌ (ఏడీ) పన్ను ప్రయోజనం తగ్గిపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏడీ ప్రయోజనాన్ని గరిష్టంగా 40 శాతానికి పరిమితం చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌ సందర్భంగా నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి కూడా వచ్చింది. ఇది అంతకుముందు వరకు 80 శాతంగా ఉండేది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా ఎత్తేయనున్నారు. మన దేశంలో ప్రస్తుతం 32,000 మెగావాట్ల సామర్థ్యంగల పవన విద్యుత్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో 70 శాతం ఏడీ పన్ను ప్రయోజనానికి సంబంధించినవే. మిగిలినవి ఉత్పత్తి ఆధారిత ప్రయోజనం (జీబీఐ) కింద నిర్మితమైనవి. తాజాగా అమ్మకానికి వచ్చిన ప్రాజెక్టుల్లో ఇవి కూడా ఉండటం గమనార్హం. జీబీఐ కింద ప్రతి యూనిట్‌ విద్యుత్‌పై 50 పైసలు ప్రభుత్వం నుంచి రాయితీగా వచ్చేది. దీన్ని కూడా ప్రభుత్వం ఎత్తేసింది.  

రాష్ట్ర ప్రభుత్వాల విరుద్ధ వైఖరి..
ఈ పరిస్థితులపై ఆర్థా ఎనర్జీ రిసోర్సెస్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ అనిమేష్‌ దమానీ మాట్లాడుతూ... ‘‘సంప్రదాయేతర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అధిక పవన విద్యుత్‌కు అవకాశం ఉండే రోజుల్లో గ్రిడ్‌ అనుసంధానతను తగ్గించడం, మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలు 18 నెలల వరకు చెల్లింపులను ఆలస్యం చేయడం వంటివి ఉదాహరణలు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతమున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను సమీక్షించి, ఇటీవల వేలంలో పలికిన ధర మేరకు కొనుగోలు ధరను తగ్గించుకోవాలని చూస్తున్నాయి’’ అని దమానీ వివరించారు.

 కర్ణాటక డిస్కమ్‌ ప్రస్తుతం అమల్లో ఉన్న పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలన్నింటినీ రద్దు చేసే యోచనలో ఉందని దమానీ తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన విద్యుత్‌పై పెట్టుబడులు పెట్టిన వారు అవి భారంగా మారకముందే విక్రయించాలనుకుంటారని దమానీ అభిప్రాయపడ్డారు. పోటీ బిడ్డింగ్‌ విధానంవల్ల ఒక యూనిట్‌ పవన విద్యుత్‌ ధర ఈ ఏడాది ఫిబ్రవరిలో కనిష్ట స్థాయి 3.46కు దిగొచ్చింది. వాస్తవానికి అంతకుముందు వరకు ఈ రంగం ‘ఫీడ్‌ ఇన్‌ టారి ఫ్‌’ పద్ధతి కింద ఉంది. ఈ విధానంలో ఉత్పత్తి వ్యయం ఆధారంగా ఒక్కో యూనిట్‌ కొనుగోలు ధర నిర్ణయం జరిగేది.   

తమిళనాడులోనే అధికం...
జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ సైతం కొన్ని ప్రాజెక్టుల యాజమాన్యాలకు వేరే రూపంలో కష్టాలు తెచ్చిపెట్టింది. ఉదాహరణకు తమిళనాడు టెక్స్‌టైల్‌ పరిశ్రమ 1,000 మెగావాట్ల సామర్త్యం గల పవన విద్యుత్‌ యూనిట్లను కలిగి ఉంది. జీఎస్టీ రేట్ల వల్ల తమిళనాడులో టెక్స్‌టైల్‌ రంగంపై గట్టి ప్రభావమే పడింది. దీంతో వీటిని విక్రయానికి పెట్టారు. ఇదే రాష్ట్రంలో మరో 700 మె.వా. సామర్థ్యం గల పవన విద్యుత్‌ యూనిట్లు సైతం అమ్మకానికి ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 400 మె.వా. ప్రాజెక్టులు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మె.వా. చొప్పున మొ త్తం 300 మె.వా. సామర్థ్యంగల ప్రాజెక్టులు, రాజస్తాన్‌లో 300 మె.వా. సామర్థ్యం ఉన్నవి విక్రయానికి ఉన్నాయి.

మరిన్ని వార్తలు