ఇన్ఫీబీమ్‌ చేతికి స్నాప్‌డీల్‌ ’యూనికామర్స్‌’

8 May, 2018 00:09 IST|Sakshi

డీల్‌ విలువ రూ. 120 కోట్లు

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ అనుబంధ కంపెనీ యూనికామర్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫీ బీమ్‌ వెల్లడించింది. ఈ–కామర్స్‌ సాఫ్ట్‌వేర్‌ సేవలందించే యూని కామర్స్‌ కొనుగోలుకు రూ. 120 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. స్నాప్‌డీల్‌ మాతృసంస్థ జాస్పర్‌ ఇన్ఫోటెక్‌కు ఆప్షనల్లీ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ను జారీ చేయటం ద్వారా ఈ డీల్‌ను పూర్తి చేస్తామని, నగదు చెల్లింపులు ఉండబోవని వివరించింది. మూడు నుంచి అయిదు నెలల్లోగా డీల్‌ పూర్తి కాగలదని అంచనా. సమగ్రమైన ఈ–కామర్స్‌ సర్వీసులు అందించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడగలదని ఇన్ఫీ బీమ్‌ ఎండీ విశాల్‌ మెహతా ధీమా వ్యక్తంచేశారు. యూనికామర్స్‌ డీల్‌కు ఆమోదముద్ర వేసిన ఇన్ఫీబీమ్‌ కార్పొరేషన్‌ బోర్డు.. తమ సంస్థ పేరును కూడా ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌గా మార్చే ప్రతిపాదనను ఓకే చేసింది. 

2012లో ఏర్పాటైన యూనికామర్స్‌ సంస్థకు 10,000 పైగా విక్రేతలు క్లయింట్స్‌గా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవరు రూ.20 కోట్లుగాను, నికర విలువ రూ.25 కోట్లుగాను ఉంది. ఇతరత్రా వ్యాపార విభాగాలను విక్రయించి, ప్రధాన వ్యాపారంపై మరింతగా దృష్టి పెట్టేందుకు ఉద్దేశించిన వ్యూహంలో భాగంగానే యూనికామర్స్‌ను విక్రయిస్తున్నట్లు స్నాప్‌డీల్‌ చీఫ్‌ స్ట్రాటెజీ, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ జేసన్‌ కొఠారి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల నుంచి తీవ్రమైన పోటీతో కుదేలయిన స్నాప్‌డీల్‌.. మళ్లీ పుంజుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పేమెంట్‌ సేవల విభాగం ఫ్రీచార్జ్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌కి రూ. 385 కోట్లకు, లాజిస్టిక్స్‌ విభాగం వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌కి రూ.35 కోట్లకు అమ్మేసింది.   

మరిన్ని వార్తలు