ఆంధ్రాబ్యాంక్ ఎండీగా సురేష్ పటేల్!

28 Oct, 2015 01:15 IST|Sakshi
ఆంధ్రాబ్యాంక్ ఎండీగా సురేష్ పటేల్!

త్వరలోనే అధికారిక ఉత్తర్వులు
* తొలిసారిగా ఉత్తరాది వ్యక్తికి కీలక బాధ్యతలు
* రేసులో వెనుకబడ్డ ఎస్‌కె కల్రా, బీ.ఎస్. రామారావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రాబ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ, సీఈవో) పదవికి  తొలిసారిగా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎంపికైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న సురేష్ పటేల్‌ను ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈవోగా కేంద్ర ఆర్థిక శాఖ నియమించినట్లు తెలుస్తోంది.

ఈ నియామక సమాచారం ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. వారం రోజుల్లో  లేదా బిహార్ ఎన్నికల అనంతరం కానీ ఈ ఉత్తర్వులు వెలువడవచ్చని సమాచారం. గుజరాత్ రాష్ట్రానికి చెందిన సురేష్ పటేల్ దేనా బ్యాంక్‌లో 30 ఏళ్లపాటు సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ రాష్ట్ర ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా కూడా ఈయన వ్యవహరించారు.

ఆంధ్రాబ్యాంక్ జాతీయకరణ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే సీఎండీలుగా అవుతూ వస్తున్నారని, కానీ ఇప్పుడు తొలిసారిగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తి రావడం వెనుక బలమైన రాజకీయ ఒత్తిళ్లు పనిచేసినట్లు ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు పేర్కొంటున్నారు. గతంలో ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరించిన సి.వి.ఆర్.రాజేంద్రన్ 2015, ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవులు ఖాళీగా ఉన్నాయి.

ఆ తర్వాత సీఎండీ పదవిని ైచైర్మన్, ఎండీ, సీఈవోగా విభజించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న ఎస్.కె.కల్రా ఎండీ సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
తెలుగు వ్యక్తికి మొండిచెయ్యి..!
ఎండీ, సీఈవో పదవికి ప్రస్తుత ఆంధ్రాబ్యాంక్ ఈడీ ఎస్.కె.కల్రా, విజయాబ్యాంక్ ఈడీ, తెలుగు వ్యక్తి  బి.ఎస్.రామారావు పేర్లే తొలినుంచి ప్రచారంలోకి వచ్చాయి. ఒక దశలో కల్రాకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెపుతారని బ్యాంకింగ్ వర్గాలు అంచనావేశాయి. ఐదు పీఎస్‌యూ బ్యాంకుల ఎండీ పోస్టులకు గత నెలలో కేంద్ర ఆర్థిక శాఖ ఇంటర్వ్యూలు నిర్వహించింది.

ఆ సందర్భంగా ఇంటర్వ్యూలో ఎంపికైన తర్వాత కల్రా పేరును వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ కమిషన్ నుంచి అనుమతులు రాకపోవడంతో కల్రా పదోన్నతి వాయిదాపడినట్లు విశ్వసనీయ సమాచారం. బీ.ఎస్. రామా రావు ఎంపికైతే 30 ఏళ్ల తర్వాత తెలుగువ్యక్తి మళ్లీ కీలకమైన పదవిలోకి వస్తాడన్న బ్యాంకు సిబ్బంది ఆశలూ ఆవిరైనట్లే కనపడుతున్నాయంటున్నారు.

1985-88లో సీఎండీగా వ్యవహరించిన  ఐఏఎస్ అధికారి ఎం.వెంకటరత్నం తర్వాత ఇంత వరకు తెలుగు వ్యక్తికి ఈ హోదా దక్కలేదు. ఈ మధ్యే చైర్మన్‌గా బి.సాంబమూర్తిని (కార్పొరేషన్ బ్యాంక్ మాజీ సీఎండీ) ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చినా, ఆయన ఆ పదవిని తిరస్కరించినట్లు తెలిసింది. ఇప్పుడు చైర్మన్ పదవి నియామకాలపై కోర్టులో పిల్ వేయడంతో ఈ నియామకాలు మరింత ఆలస్యం కానున్నాయి.

మరిన్ని వార్తలు