మరో 23 నగరాలకు లెమన్‌ ట్రీ

8 May, 2018 00:16 IST|Sakshi

జతకూడనున్న 29 హోటళ్లు

మిడ్‌ సెగ్మెంట్లో తొలి స్థానం మాదే

లెమన్‌ ట్రీ ప్రెసిడెంట్‌ విక్రమ్‌జిత్‌   

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న లెమన్‌ ట్రీ కొత్తగా 29 హోటళ్లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా 23 నగరాల్లో తొలిసారిగా అడుగు పెడుతోంది. దీంతో సంస్థ సేవలందిస్తున్న నగరాల సంఖ్య 54కు చేరుకోనుంది. ఇప్పటికే లెమన్‌ ట్రీ దేశవ్యాప్తంగా 49 హోటళ్లను నిర్వహిస్తోంది. కొత్త ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.1,700 కోట్లు వెచ్చిస్తున్నట్టు సంస్థ ప్రెసిడెంట్‌ విక్రమ్‌జిత్‌ సింగ్‌  తెలిపారు. 2021 నాటికి సంస్థ గదుల సంఖ్య 4,907 నుంచి 8,152కు చేరుతుందన్నారు. సోమవారం ఇక్కడ బంజారాహిల్స్‌లో లెమన్‌ ట్రీ హోటల్‌ ను ప్రారంభించిన సందర్భంగా సీవోవో సుమంత్‌ జైడ్కా, సౌత్‌ డైరెక్టర్‌ నరోతమ్‌ సింగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. 

టాప్‌లో హైదరాబాద్‌..
కొత్త హోటల్‌లో 85 గదులున్నాయి. తాజాగా ఆరంభించినదానితో కలిసి లెమన్‌ ట్రీ హోటళ్ల సంఖ్య హైదరాబాద్‌లో నాలుగుకు చేరింది. 663 గదులతో సంస్థకు హైదరాబాద్‌ నెంబర్‌–1 గమ్యస్థానంగా నిలుస్తోంది. మిడ్‌ ప్రైస్‌ సెగ్మెంట్లో భారత్‌లో తొలి స్థానాన్ని తాము కైవసం చేసుకున్నామని విక్రమ్‌జిత్‌ తెలిపారు. ‘వచ్చే అయిదేళ్లు హోటల్‌ గదులకు డిమాండ్‌లో 12.4%, సరఫరాలో 7.9% వృద్ధి ఉంటుంది. హోటళ్లకు డిమాండ్‌ ఉంటుంది కాబట్టి చార్జీలు పెరుగుతాయి’ అని చెప్పారాయన. కాగా, సంస్థలో 5,500 మంది పనిచేస్తున్నారు. వీరిలో అంగవికలురు, వితంతువులు, పేదవారు, నిరక్షరాస్యులు 21% మంది ఉన్నట్లు విక్రమ్‌జిత్‌ తెలియజేశారు.  

మరిన్ని వార్తలు