ఆపత్కాలంలో బీమా భరోసా

23 Mar, 2014 00:15 IST|Sakshi
ఆపత్కాలంలో బీమా భరోసా

 మన ఆర్థిక అవసరాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. హఠాత్పరిణామాల వల్ల ఆదాయ మార్గాలు మూసుకుపోయినప్పుడు కుటుంబం కుదేలయ్యే ఘటనలు ప్రాంతాలకు అతీతంగా నగరాల్లోనూ, గ్రామాల్లోనూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ఇలాంటి రిస్కులు ఉన్నాయని తెలిసినా సరే.. చాలా మంది వాటిని ధైర్యంగా ఎదుర్కొనే సాధనాలను సమకూర్చుకోరు.


వీటిని ఎదుర్కొనడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, ఇందుకోసం కొంత ప్లానింగ్, కొన్ని క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, మరికొంత క్రమశిక్షణ అవసర మవుతాయి.
 

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నంత కాలం ఇంట్లో ఎవరికి ఆర్థిక కష్టాలు వచ్చినా కుటుంబసభ్యులు బాసటగా నిల్చేవారు. ప్రస్తుతం న్యూక్లియర్ కుటుంబాలు పెరుగుతున్న కొద్దీ అటువంటి పరిస్థితి ఉండటం లేదు. ఈ నేపథ్యంలో.. ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి భరోసా కల్పించేది జీవిత బీమా. ఇది కూడా ఒక్కరి కష్టాన్ని అందరూ కలిసి పంచుకునేవంటిదే. అందుకే, ప్రస్తుతం బీమా కవరేజి ప్రాముఖ్యత పెరుగుతోంది. జీవిత బీమా, వైద్య బీమాతో పాటు రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు ప్లానింగ్ ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొంగొత్త పొదుపు సాధనాలు వస్తున్నప్పటికీ .. భారతీయులకు వీటిపై అంతగా అవగాహన ఉండటం లేదు. బ్యాంక్ డిపాజిట్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులకే ఇప్పటికీ ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు.



ప్రైవేట్ ఆర్థిక సంస్థలపై అపనమ్మకం ఇందుకు కారణం కావొచ్చు. ఇలాంటి అపోహల వల్లే వారు ఇన్వెస్ట్‌మెంట్ పరంగాను, భద్రతపరంగా ధీమానిచ్చే బీమా వంటి సరైన సాధనాలను ఎంపిక చేసుకోలేకపోతున్నారు. నిజానికి జీవిత బీమా కవరేజిలో రెండిందాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకవేళ కుటుంబ పెద్దకి అనుకోనిది ఏమైనా జరిగినా.. కుటుంబ సభ్యుల అవసరాలకు కావాల్సిన నిధి అందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ అలాంటి అవాంఛనీయమైన  ఘటనలు జరగకుండా, అంతా సవ్యంగానే సాగితే కనీసం రిటైర్మెంట్ అవసరాలకైనా బీమా సొమ్ము ఉపయోగపడగలదు. అందుకే దీర్ఘకాలంలో ఇటు క్రమం తప్పకుండా పొదుపు, అటు చక్రవడ్డీ తరహా రాబడిలనుసాధనాల్లో బీమా ఒకటని చెప్పవచ్చు.  
 

ఇక, చివరిగా.. పాలసీలు తీసుకున్న వారిలో చాలా మంది.. తాము వీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెబుతుంటారు. ఇది మంచిదే. కానీ ఏదో ఒక పాలసీ..ఎంతో కొంతకు తీసుకోవడం సరికాదు. జీవితంలో వివిధ దశలకు అనుగుణంగా సరిపడినంత కవరేజి ఉండేలా తీసుకుంటేనే పాలసీ ప్రయోజనాలు పొందగలమని గుర్తుంచుకోవాలి.

మరిన్ని వార్తలు