తగ్గుతున్న మహిళా ఉద్యోగుల సంఖ్య

27 Jun, 2016 01:24 IST|Sakshi
తగ్గుతున్న మహిళా ఉద్యోగుల సంఖ్య

అసోచామ్ సర్వే
న్యూఢిల్లీ: దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పదేళ్ల కాలంలో 10 శాతం మేర పడిపోవడంతో తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అసోచామ్ ప్రభుత్వానికి సూచించింది. 2000-2005 మధ్య దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 34 శాతం నుంచి 37 శాతానికి పెరగగా... 2005 నుంచి 2014కు వచ్చేసరికి 27 శాతానికి పడిపోయినట్టు ప్రపంచ బ్యాంకు పేర్కొనడాన్ని అసోచామ్ ‘భారత్‌లో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో ప్రధానంగా ప్రస్తావించింది.

దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం ఉద్యోగావకాశాల కల్పన, వ్యాపార అవకాశాల సృష్టి ద్వారా మహిళల సాధికారతకు చర్యలు చేపట్టాలని కోరింది. మహిళా ఉద్యోగుల సంఖ్య పరంగా బ్రిక్స్ దేశాల్లో భారత్ మాత్రమే అట్టడుగున ఉండడాన్ని ప్రముఖంగా పేర్కొంది. బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్‌లో మహిళా ఉద్యోగులు 59 శాతం, రష్యాలో 57 శాతం, దక్షిణాఫ్రికాలో 45% ఉండగా, భారత్‌లో 27శాతంగా ఉంది.

ఉన్నత విద్యావకాశాల్ని పొందలేకపోవడం, ఉద్యోగావకాశాలు లేకపోవడం, పని ప్రదేశంలో సౌకర్యాలు లేకపోవడం వల్ల మహిళలు ఇంటి పనులకే పరిమితం అవుతున్నారని అసోచామ్ వెల్లడించింది. వివాహం కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని పేర్కొంది.

మరిన్ని వార్తలు