ద్రవ్యోల్బణంపై దాడి చేద్దాం !

17 Apr, 2017 01:09 IST|Sakshi
ద్రవ్యోల్బణంపై దాడి చేద్దాం !

డబ్బును అల్మారాలో, బ్యాంకు ఖాతాలో ఉంచితే నష్టమే
ఏటా ద్రవ్యోల్బణం రూపంలో డబ్బు విలువ క్షీణత
పెట్టుబడులకు మళ్లించకపోతే పేదరికమే!
దీర్ఘకాలంలో అవసరాలు తీరాలంటే డబ్బు సంపదగా మారాలి
అందుకు సరైన దిశగా అడుగులు వేయాలి
 


ప్రతి కుటుంబానికీ ఆర్థిక అవసరాలెన్నో ఉంటాయి. సంపన్న వర్గాలను పక్కన పెడితే సామాన్య, మధ్యతరగతి జీవులకు ప్రతీ నెలా వచ్చే ఆదాయమే ఆధారం. అందులోనే అతికష్టం మీద కొంచెం పొదుపు చేసి పక్కన పెడుతుంటారు. ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లించేది కొద్దిమందే. అందులోనూ ఆ పొదుపును సంపదగా మార్చే సాధనాల వైపు మళ్లించేది ఇంకా తక్కువ మంది. మిగిలిన వారు ఆశ్రయించే మార్గాలు కేవలం వారి దగ్గరున్న డబ్బు విలువను కాపాడుతాయంతే. అందుకే సంపద సమకూరాలంటే ద్రవ్యోల్బణ శాస్త్రం తెలిసి ఉండాలి.
 
‘‘దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కలిగించే నష్టం గురించి ఇన్వెస్టర్లలో కొద్ది మందిలోనే అవగాహన ఉంటుంది’’ అని ప్రముఖ ఆర్థిక నిపుణుడు ధీరేంద్ర కుమార్‌ చెప్పారు. ప్రతి నెలా ఆర్జిస్తున్న మొత్తంలో ఓ 20 శాతాన్ని పొదుపు చేశారనుకుందాం. దాన్ని తీసుకెళ్లి ఇంట్లో లేదంటే బ్యాంకు ఖాతాలో ఉంచేసి నెలనెలా వేతనంలో పొదుపు చేస్తున్నానని మురిసిపోతే అది అమాయకత్వమే అవుతుంది. పొదుపు కాదు, మంచి రాబడులను ఇచ్చే వాటిని ఎంచుకుని మదుపు చేసినప్పుడే అనుకున్నవి నెరవేరతాయి.

ఉదాహరణకు ఏడాది క్రితం పెట్రోల్‌ ధర ఎంతుందో గుర్తు చేసుకోండి. లీటరు 59.68. ప్రస్తుతం రూ.67.50 (ఢిల్లీలో). సుమారు 13 శాతం పెరిగినట్టు తెలియడం లేదూ... అలాగే మిగిలిన వస్తువులు కూడా. కొన్ని ధరలు తగ్గొచ్చు. కానీ, సగటు జీవనానికి కావాల్సిన నిత్యావసరాల ధరలు ఏటేటా పెరగడం సర్వ సాధారణంగా జరిగేదే. ఇలా ధరలు పెరిగితే కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. ధరలు 10 శాతం పెరిగాయంటే... ఏడాది క్రితం రూ.100 పెట్టి కొనుగోలు చేసిందానికి ప్రస్తుతం రూ.110 చెల్లిస్తే గానీ రాదు. దీన్నే డబ్బు విలువ క్షీణించడం (ద్రవ్యోల్బణం)గా పేర్కొంటారు.

దీన్ని ఇప్పుడు పొదుపునకు అన్వయించి చూడండి. మీరు రూ.10,000లను పొదుపు చేసి ఏడాదిగా ఇంట్లోనే దాచి ఉంచారనుకోండి. ఆ తర్వాత కూడా రూ.10 వేలే ఉంటాయి. కానీ ఆ డబ్బు విలువ ఎంతో కొంత తగ్గి ఉంటుంది. ఇంట్లోనే ఉంచేసుకోవడం వల్ల కలిగిన నష్టం ఇది. చేప ఎప్పుడూ నీటిలోనే పెరుగుతుంది. అలానే డబ్బు ఎప్పుడూ పెట్టుబడుల్లోనే వృద్ధి చెందుతుంది. ఈ విషయం తెలియక కొందరు నష్టపోతే... తెలిసిన వారు ఆచరణలో పెట్టక నష్టపోతుంటారు.  

కేవలం పొదుపుతో నష్టం!
మన దేశంలో సామాన్యుల్లో ఇప్పటికీ చాలా మంది డబ్బును ఇళ్లలోనే ఉంచేస్తున్నారన్న విషయం ఇటీవల పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల వద్ద రద్దీ తెలియజెప్పింది. ముఖ్యంగా గృహిణుల పొదుపు ఇంటికే పరిమితం అవుతోంది. ఇల్లు కావచ్చు, బ్యాంకు ఖాతా కావచ్చు. ఇవి మన దగ్గరున్న డబ్బు విలువను కాపాడేవి కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బు ఎప్పుడూ తన విలువను కాపాడుకోలేదు. ఇదంతా ద్రవ్యోల్బణం మహిమ. దీనివల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే కాలానుగుణంగా నిత్యావసరాలు, వస్తువుల ధరలు పెరిగిపోవడం.

రాబడి తక్కువుంటే ఏమవుతుంది...?  
ఎవరెన్ని చెప్పినా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనే పెట్టుబడి పెడతా అనే బాపతు కొందరుంటారు. రాబడులు తక్కువగా వస్తాయని చెబితే... కాంపౌండెడ్‌ ఇంట్రెస్ట్‌ గురించి చెబతుంటారు. నిజమే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో 7 శాతం వడ్డీ వస్తుందనుకోండి. ఆరు నెలలకో, ఏడాదికో ఆ వడ్డీ అసలు మొత్తంలో కలుస్తుంది. దీంతో ఆ వడ్డీపైనా వడ్డీ వస్తుంది. దీన్నే చక్రవడ్డీ అంటాం. కానీ, ద్రవ్యోల్బణం మింగేసే డీకాంపౌండింగ్‌ ఎఫెక్ట్‌ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అంటే చక్రవడ్డీ రూపంలో వచ్చినదాన్ని ద్రవ్యోల్బణం మింగేస్తుంటుంది.

ఏటా ద్రవ్యోల్బణం అన్నది అంతకుముందు ఏడాదిలో ఉన్న ద్రవ్యోల్బణ గరిష్ట శాతంపైనే నమోదవుతూ ఉంటుంది. వడ్డీపై వడ్డీ మాదిరిగా. రూ.లక్ష రూపాయలను తీసుకెళ్లి బ్యాంకులో ఎఫ్‌డీ చేస్తే వచ్చే వడ్డీ రాబడి 7 శాతం. అదే ఏడాదిలో ధరలు 7 శాతం పెరిగిపోతే వచ్చిన లాభం ఏముంటుంది ఆలోచించండి...? అసలు మొత్తం పెరిగింది. కానీ ఆ పెరిగిన మొత్తంతో వచ్చేదేమీ ఉండదు. ఉదాహరణకు రూ.లక్ష పదేళ్ల కాలంలో రూ.2.16 లక్షలు అవుతాయి. అదే సమయంలో జీవనానికి అవసరమైన వాటి ధరలు పదేళ్ల క్రితం రూ.లక్షకు వచ్చిన వాటికి ఇప్పుడు ఇంచుమించుగా రూ.2.16 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ఎలా ఉన్నారో, వారి స్థాయి పదేళ్ల తర్వాతా అలానే ఉంటుంది. ధనవంతులు కాలేరు. వారి కొనుగోలు శక్తి అప్పుడు ఎంతుందో ఇప్పుడూ అంతే.  30 ఏళ్ల క్రితం రూ.10,000 సంపాదించిన వారు నెలంతా సౌకర్యంగా, గొప్పగా బతికేవారు. నేడు రూ.10,000లతో ఏ రకంగా జీవించవచ్చో అర్థం చేసుకోండి.

ఊహించడం కష్టమే
భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే ఊచించడం కష్టం. ఉదాహరణకు రాజీవ్‌ వయసు 40 ఏళ్లు. 60 ఏళ్లకు రిటైర్‌ అవుతాడని అనుకుంటే ఇప్పటి మాదిరిగానే అప్పుడూ మధ్యతరగతి జీవనం కోసం నెలకు రూ.2.5 లక్షలు అవసరం అవుతాయి. రూ.2.5 లక్షలతో ఇప్పుడు ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం ఏడాది అవసరాలు తీరతాయి. కానీ 20 ఏళ్ల తర్వాత పరిస్థితి చూస్తే అంతే మొత్తం నెల అవసరాలకు కావల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. ఇక రాజీవ్‌కు 80 ఏళ్ల వయసు వచ్చే సరికి నెల జీవనానికి కనీసం రూ.10 లక్షలు అవసరం ఉంటుంది.  

గుర్తిస్తేనే విజేత...
ద్రవ్యోల్బణం తక్కువగా ఉండే దేశంగా మారాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కానీ, అంతకంతకూ పెరిగిపోతున్న జనాభాతో ద్రవ్యోల్బణ నియంత్రణ కష్టతరం అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ సామాన్యుడిగా డబ్బు విలువను కాపాడుకుంటూ ద్రవ్యోల్బణం మించి మెరుగైన రాబడులను ఇచ్చే మార్గాల్లోకి పొదుపును మళ్లించాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటి సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసేవారు వాటిపై రాబడులు చాలా తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఓ 20 ఏళ్లలో రూ.2 కోట్లను సమకూర్చుకోవాలి అనుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు 8 శాతం రాబడినిచ్చే సాధనంలో ప్రతీ నెలా రూ.1.7 లక్షల చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. అదే రాబడి 10 శాతం వచ్చే దానిలో అయితే రూ.1.3 లక్షలు ఇన్వెస్ట్‌ చేసే సరిపోతుంది.

అలాగే 20 ఏళ్లలో రూ.కోటి కావాలనుకోండి. 10 శాతం రాబడి వచ్చే సాధనంలో ప్రతి నెలా రూ.1,38,124 చొప్పున పెట్టుబడి పెట్టాలి. రాబడి 14 శాతంగా ఉంటే రూ.85,217 చాలు. రాబడి 18 శాతం అయితే కేవలం రూ.51,901 సరిపోతాయి. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్, ట్యాక్స్‌ సేవింగ్స్‌ పథకాలు ఈ స్థాయిలో రాబడులను ఇస్తాయని చరిత్ర చెబుతోంది. కనుక బ్యాంకు డిపాజిట్ల వంటి తక్కువ రాబడులను ఇచ్చే వాటిని నమ్ముకుంటే మెరుగైన రాబడులను పొందలేరు. వాస్తవిక రాబడులు చాలా స్వల్పం. పన్ను పరిధిలో ఉన్న వారు అయితే బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చిన రాబడులపై పన్ను కట్టగా, ద్రవ్యోల్బణం హరింపు తీసివేయగా నికరంగా నష్టమే వస్తుంది. కనుక ఇలాంటి వాటిని నమ్ముకుంటే విశ్రాంత జీవనం, పిల్లల వివాహాలు, ఇంటి కొనుగోలు వంటి దీర్ఘకాల అవసరాలు తీర్చుకోవడం కష్టతరం అవుతుంది. వారసత్వంగా ఇల్లు, ఇతర ఆస్తులు వచ్చిన వారికైతే ఏ ఇబ్బంది లేదు. కానీ, కష్టార్జితాన్నే నమ్ముకున్న వారు ద్రవ్యోల్బణం గురించి తెలుసుకుని మెరుగైన రాబడులను ఆశ్రయించడం ఉత్తమం.

డబ్బు విలువ తరిగేది ఇలా...
1984లో రూ.లక్షను పొదుపు చేసి దాన్ని అలానే ఇంట్లో దాచి ఉంచారనుకోండి. ఇప్పుడు ఆ లక్ష వలువ రూ.7,451. పొదుపును పెట్టుబడులుగా మార్చి రాబడులను ఆర్జించకుంటే ఎంత దాచినా ద్రవ్యోల్బణం పేదవారిని చేస్తుందనడానికి ఇదే నిదర్శనం.

మరిన్ని వార్తలు