చతికిలపడిన బజాజ్ ఆటో

3 Apr, 2017 12:12 IST|Sakshi
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్‌ కంపెనీలు వాహన విక్రయాలు టాప్ గేర్ లో దూసుకెళ్లగా.. బజాజ్ ఆటో మాత్రం చతికిలపడింది. మార్చి నెల బజాజ్ ఆటో విక్రయాలు ముందటి ఏడాది ఇదే నెలతో పోలిస్తే 10.98 శాతం పడిపోయాయి. కేవలం 2,72,197 యూనిట్లగానే నమోదయ్యాయి.  గతేడాది ఇదేనెలలో బజాజ్ విక్రయాలు 3,05,800 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయంగానూ తమ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 17.13 శాతం పడిపోయినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
 
గతేడాది 2,04,281గా  ఉన్న దేశీయ విక్రయాలు ఈ ఏడాది 1,69,279 యూనిట్లగా మాత్రమే రికార్డయ్యాయి. మొత్తంగా మోటార్ సైకిల్ విక్రయాలు 7.57 శాతం క్షీణించినట్టు కంపెనీ ప్రకటించింది. దేశీయ మోటార్స్ సైకిల్ విక్రయాలు 14.33 శాతం పడిపోయి 1,51,449గా నమోదైనట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే మార్చి నెల ఎగుమతులు 1.37 శాతం ఎగిసి 1,02,918 యూనిట్లగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. గతేడాది ఈ ఎగుమతులు 1,01,519 యూనిట్లుగా ఉన్నాయి.
 
మరిన్ని వార్తలు