బీహెచ్‌ఈఎల్ లాభం రూ. 194 కోట్లు

13 Aug, 2014 02:16 IST|Sakshi
బీహెచ్‌ఈఎల్ లాభం రూ. 194 కోట్లు

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ప్రభుత్వ రంగ దిగ్గజం బీహెచ్‌ఈఎల్ నికర లాభం భారీగా క్షీణించి రూ. 193.5 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 465.4 కోట్ల లాభాన్ని ఆర్జించింది. విద్యుత్, పారిశ్రామిక విభాగాల నుంచి అమ్మకాలు పడిపోవడం ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. ఇక ఆదాయం కూడా రూ. 6,353 కోట్ల నుంచి రూ. 5,068 కోట్లకు క్షీణించింది.

ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు దాదాపు 1% లాభంతో రూ. 224 వద్ద ముగిసింది. విద్యుత్ విభాగం ఆదాయం రూ. 5,379 కోట్ల నుంచి రూ. 4,144 కోట్లకు క్షీణించగా, పారిశ్రామిక విభాగం ఆదాయం సైతం రూ. 1,293 కోట్ల నుంచి రూ. 1,133 కోట్లకు తగ్గింది. కాగా, ఐదు ఇతర పీఎస్‌యూలతో కలసి రాజస్తాన్‌లో 4,000 మెగావాట్ల భారీ సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్‌ను బీహెచ్‌ఈఎల్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

 ప్రపంచంలోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్‌కాగా, ఈ జేవీలో బీహెచ్‌ఈఎల్‌కు 26% వాటా ఉంటుంది. మిగిలిన సంస్థలలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్(ఎస్‌ఈసీఐ) 23%, సంభార్ సాల్ట్(ఎస్‌ఎస్‌ఎల్) 16%, పీజీసీఐఎల్ 16%, సట్లుజ్ జల్ విద్యుత్(ఎస్‌జేవీఎన్‌ఎల్) 16%, రాజస్తాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్(ఆర్‌ఈఐఎల్) 3% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌కు పరికరాలను బీహెచ్‌ఈఎల్ సరఫరా చేస్తుంది.

మరిన్ని వార్తలు