ఫ్లిప్‌కార్ట్‌కు ఊరట

28 Feb, 2020 09:46 IST|Sakshi

 న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ)లో ఊరట లభించింది. సంస్థపై దివాలా పక్రియ ప్రారంభానికి సంబంధించి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన రూలింగ్‌ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ కొట్టేసింది. ఎన్‌సీఎల్‌టీ నియమించిన తాత్కాలిక రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌కి కీలక ఆదేశాలిస్తూ, కేసు రికార్డులను, కంపెనీ అసెట్స్‌ను తక్షణం ప్రమోటర్‌కు స్వాధీనం చేయాలంది. ఫ్లిప్‌కార్ట్‌కు ఆపరేషనల్‌ క్రెడిటార్‌గా ఉన్న క్లౌండ్‌వాకర్‌ స్ట్రీమింగ్‌ టెక్నాలజీస్‌ సెక్షన్‌ 9 కింద దాఖలు చేసిన ఇన్సాల్వెన్సీ పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్‌ గతేడాది అక్టోబర్‌ 24న అనుమతించింది. (సీసీఐపై సంచలన ఆరోపణలు, హైకోర్టుకు ఫ్లిప్‌కార్ట్‌)

దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా డైరెక్టర్‌ నీరజ్‌ జైన్‌ అప్పీల్‌ చేశారు. దిగుమతి చేసుకున్న ఎల్‌ఈడీ టీవీల సరఫరాల లావాదేవీకి సంబంధించి రూ.26.95 కోట్లు ఫ్లిప్‌కార్ట్‌ బకాయి పడినట్లు క్లౌండ్‌వాకర్‌ స్ట్రీమింగ్‌ టెక్నాలజీస్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దీనిని ఎన్‌సీఎల్‌టీ ఆమోదించడాన్ని అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ కొట్టివేస్తూ, ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్ట్రప్సీ కోడ్‌ (ఐబీసీ) సెక్షన్‌ 8 (1) కింద పంపిన నోటీసు ‘‘తగిన విధంగా లేదు. అసంపూర్తిగానూ ఉంది’’ అని తన ఉత్తర్వులో పేర్కొంది. రుణ చెల్లింపులకు సంబంధించి తగిన డాక్యుమెంట్లనూ క్లౌండ్‌వాకర్‌ స్ట్రీమింగ్‌ టెక్నాలజీస్‌ సమర్పించలేకపోయినట్లు తెలిపింది. తగిన ఇన్‌వాయిస్‌లు, దివాలా పిటిషన్‌లో పేర్కొన్న డాక్యుమెంట్‌ నకళ్లనూ ట్రిబ్యునల్‌ ముందు ఉంచలేకపోయినట్లు పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు