అనైతిక డిస్కౌంట్లను ప్రభుత్వం కట్టడి చేయాలి

30 Oct, 2023 06:31 IST|Sakshi

సీయూటీఎస్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ రంగంలో రేట్లను పెంచేసి ఆపైన భారీగా డిస్కౌంట్లు ప్రకటించడం లాంటి అనైతిక ధోరణులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఒక నివేదికలో అభిప్రాయపడింది. అసలు రేటు ఎక్కువే ఉన్నప్పటికీ తాము తక్కువకే కొంటున్నామనే తప్పుడు భావనను వినియోగదారుల్లో కలిగించే ఇలాంటి పద్ధతులు .. మోసం కిందకే వస్తాయని పేర్కొంది.

ఫ్లాష్‌ అమ్మకాలపై ఎకాయెకిన నిషేధం విధించడం కాకుండా వినియోగదారుల హక్కుల పరిరక్షణను పటిష్టం చేయడంపైనా, మార్కెట్లో విక్రేతలందరికీ సమాన అవకాశాలు లభించేలా చూడటంపైనా ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్‌ వివరించింది. భారీగా డిస్కౌంటునివ్వడం, పోటీ సంస్థలను దెబ్బతీసే ఉద్దేశంతో అత్యంత చౌకగా అమ్మడం అనే రెండు విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలను నిర్దేశించాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండింటినీ ఒకదానికొకటి పర్యాయపదాలుగా ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం నెలకొందని తెలిపింది.

మరిన్ని వార్తలు