ఆర్‌ఈసీలో వాటా విక్రయానికి ఓకే

7 Dec, 2018 04:25 IST|Sakshi

కొత్త వ్యవసాయ ఎగుమతుల విధానానికి క్యాబినెట్‌ ఆమోదం  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరిన్ని సంస్థల విలీనాలకు తెరతీస్తూ ఆర్‌ఈసీలో వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకా రం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ)కు మొత్తం 52.63% వాటాలను విక్రయించనుంది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ డీల్‌ ద్వారా ఖజానాకు సుమారు రూ.15,000 కోట్లు దఖలు పడనున్నాయి. వాస్తవానికి ఆర్‌ఈసీకే పీఎఫ్‌సీలో వాటాలను విక్రయించాలని ముందుగా భావించినప్పటికీ... విద్యుత్‌ శాఖ జోక్యంతో ప్రతిపాదన మారింది. సెప్టెంబర్‌ ఆఖరు నాటికి కేంద్రానికి ఆర్‌ఈసీలో 57.99 శాతం, పీఎఫ్‌సీలో 65.64 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, ఈటీఎఫ్‌ ద్వారా కొన్ని వాటాలను విక్రయించడంతో ఆర్‌ఈసీలో కేంద్రం హోల్డింగ్‌ 52.63 శాతానికి తగ్గింది.

మరోవైపు, 2022 నాటికి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను రెట్టింపు స్థాయిలో 60 బిలియన్‌ డాలర్లకు పెంచుకునే లక్ష్యంలో భాగంగా కొత్త వ్యవసాయ ఎగుమతి విధానానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. టీ, కాఫీ, బియ్యం వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను పెంచుకోవడానికి, అంతర్జాతీయ అగ్రి–ట్రేడ్‌లో మరింత వాటా దక్కించుకునేందుకు ఇది దోహదపడగలదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు చెప్పారు. మౌలిక సదుపాయాల ఆధునీకరణ, ఉత్పత్తులకు ప్రమాణాలు నెలకొల్పడం, నిబంధనలను క్రమబద్ధీకరించడం, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారించడం వంటి అంశాలకు ఈ విధానం కింద ప్రాధాన్యం లభించనున్నట్లు ఆయన వివరించారు.   

మరిన్ని వార్తలు