‘కేర్’లోకి మరో హాస్పిటల్

22 Apr, 2015 01:31 IST|Sakshi
‘కేర్’లోకి మరో హాస్పిటల్

* రూ. 200 కోట్లతో అలగ్జాండ్రియా మెడిసిటీ కొనుగోలు
* 250 పడకల హాస్పిటల్‌కు కేర్ హైటెక్ సిటీగా పేరు మార్పు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా కేర్ హాస్పిటల్స్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మధ్యనే వైజాగ్‌లో 100 పడకల హాస్పిటల్‌ను కొనుగోలు చేసిన కేర్ తాజాగా హైదరాబాద్‌లో మరో హాస్పిటల్‌ను కొనుగోలు చేసింది. హైటెక్ సిటీ సమీపంలోని 250 పడకల అలగ్జాండ్రియా మెడిసిటీని రూ. 200 కోట్లకు కోనుగోలు చేసినట్లు ప్రకటించింది.

కేర్ హైటెక్ సిటీగా ఈ హాస్పిటల్ పేరు మార్చామని, ఇందులో గుండె, నాడీ మండలం, మూత్ర పిండాల వ్యాధుల చికిత్సలకు తోడు ఆంకాలజీ, అవయవాల మార్పిడి చికిత్సలపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు కేర్ హాస్పిటల్ ప్రతినిధి తెలిపారు. ఈ హాస్పిటల్ టేకోవర్‌కు కావల్సిన నిధులను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ సమకూర్చింది.

ఈ హాస్పిటల్ చేరికతో అధునాతనమైన అన్ని రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు కేర్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్. బి. సోమరాజు తెలిపారు. త్వరలోనే గచ్చిబౌలి సమీపంలో వివిధ హాస్పిటల్స్‌కు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కొత్త హాస్పిటల్ నిర్మాణం చేపట్టే యోచనలో కేర్ ఉంది. కేర్ హైటెక్ సిటీ రాకతో కేర్ గ్రూప్ హాస్పిటళ్ల మొత్తం పడకల సంఖ్య 2,400కు చేరింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 3,000కు చేరనుంది.

మరిన్ని వార్తలు