బ్లాక్‌స్టోన్‌ చేతికి కేర్‌ హాస్పిటల్స్‌ - వివరాలు

31 Oct, 2023 07:06 IST|Sakshi

72.5 శాతం వాటాకు రూ. 5,827 కోట్లు

కిమ్స్‌హెల్త్‌లోనూ వాటాలు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ తాజాగా హైదరాబాద్‌కు చెందిన కేర్‌ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. టీపీజీ రైజ్‌ఫండ్స్‌లో భాగమైన ఎవర్‌కేర్‌ హెల్త్‌ ఫండ్‌ నుంచి 72.5 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు మొత్తం మీద 700 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 5,827 కోట్లు) వెచ్చిస్తున్నట్లు వివరించింది. ఈ లావాదేవీ కోసం కేర్‌ హాస్పిటల్స్‌ సంస్థ విలువను రూ. 6,600 కోట్లుగా లెక్కగట్టారు.

మరోవైపు, కేరళకు చెందిన కిమ్స్‌హెల్త్‌ సంస్థలో కేర్‌ హాస్పిటల్స్, టీపీజీ 80 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌ కింద బ్లాక్‌స్టోన్‌ 300 మిలియన్‌ డాలర్లు, టీపీజీ 100 మిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నట్లు వివరించాయి. దీంతో బ్లాక్‌స్టోన్‌ దేశీయంగా ఆరోగ్య సేవల విభాగంలోకి ప్రవేశించినట్లవుతుంది. ఈ రెండు డీల్స్‌ ద్వారా మొత్తం 1 బిలియన్‌ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్‌ చేసినట్లవుతుంది. సంయుక్త నెట్‌వర్క్‌లో టీపీజీ

చెప్పుకోతగ్గ స్థాయిలో వాటాలున్న మైనారిటీ షేర్‌హోల్డరుగా ఉంటుంది. భారత హెల్త్‌కేర్‌ సర్వీసుల రంగంలో తొలిసారిగా పెట్టుబడులు 
పెట్టడం, దేశీయంగా అతి పెద్ద హెల్త్‌కేర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు టీపీజీతో జట్టు కట్టడం తమకు సంతోషకరమైన అంశాలని బ్లాక్‌స్టోన్‌ ఎండీ గణేష్‌ మణి తెలిపారు. 

భారీ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌లో ఒకటిగా..
కేర్‌ హాస్పిటల్స్‌కు హైదరాబాద్, వైజాగ్‌తో పాటు ఔరంగాబాద్, నాగ్‌పూర్‌ తదితర నగరాల్లో ఆస్పత్రులు ఉన్నాయి. కిమ్స్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ .. కేరళలోనే అతి పెద్ద ప్రైవేట్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్‌గా ఉంది. కిమ్స్‌హెల్త్‌ చేరికతో దేశీయంగా భారీ హాస్పిటల్స్‌ చెయిన్‌లో ఒకటిగా కేర్‌ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌ ఆవిర్భవించనుంది. ఈ సంయుక్త నెట్‌వర్క్‌కు 11 నగరాల్లో 23 ఆస్పత్రులు, 4,000 పైచిలుకు పడకలు ఉంటాయి. ప్రస్తుతం కిమ్స్‌హెల్త్‌కు నేతృత్వం వహిస్తున్న ఎంఐ సహాదుల్లా ఇకపైనా దాని సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు.

మరిన్ని వార్తలు